సరుకు రవాణా కోసం.. రో-రో సర్వీసులపై రైల్వే దృష్టి

ABN , First Publish Date - 2020-04-03T22:01:14+05:30 IST

నిత్యావసర సరుకులతో నిండిన ట్రక్కుల రవాణాను వేగవంతం చేసేందుకు ‘రోల్ ఆన్ రోల్ ఆఫ్’ (రో-రో) సేవలను

సరుకు రవాణా కోసం.. రో-రో సర్వీసులపై రైల్వే దృష్టి

న్యూఢిల్లీ: నిత్యావసర సరుకులతో నిండిన ట్రక్కుల రవాణాను వేగవంతం చేసేందుకు  ‘రోల్ ఆన్ రోల్ ఆఫ్’ (రో-రో) సేవలను ప్రారంభించాలని సెంట్రల్ అండ్ సౌత్‌వెస్టర్న్ రైల్వే నిర్ణయించింది. సరుకులతో కూడిన ట్రక్కులు రోడ్డు మార్గంలో జమ్ము నుంచి కన్యాకుమారి చేరుకునేందుకు దాదాపు రెండు వారాలు పడుతుంది. అదే రో-రో సేవల్లో భాగంగా అయితే కేవలం ఐదారు రోజుల్లోనే కన్యాకుమారికి చేరుకోవచ్చు.


రో-రో సేవల్లో భాగంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వేగన్లలో ట్రక్కులు, కార్లను రవాణా చేస్తారు. మార్చి 17న తొలి రో-రో సేవలను రైల్వే ప్రారంభించింది. ఇందులో భాగంగా 30 లోడు చేసిన ట్రక్కులను గురుగ్రామ్‌లోని గర్హి హర్సురు స్టేషన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మురద్‌నగర్‌కు రవాణా చేసింది. రోడ్డుమార్గంలో ఏవైనా అవాంతరాలు ఎదురైనప్పుడు  నిత్యావసర సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుందని, కాబట్టి కీలక సమయాల్లో రో-రో సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని రైల్వే అధికారులు తెలిపారు. 


లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో సరుకు రవాణా రైళ్లకు ఎటువంటి ఆటంకం ఉండడం లేదు. రో-రో సేవల ద్వారా ట్రక్కులు నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అవసరమైన ప్రదేశాలకు సరుకులను సులభంగా తరలించవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానం వల్ల రవాణా సాఫీగా జరగడమే కాకుండా రిస్క్ కూడా ఉందని పేర్కొంది. 

Updated Date - 2020-04-03T22:01:14+05:30 IST