Railways: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఇకపై ఆ 50 రూపాయలు కట్టక్కర్లేదు..!

ABN , First Publish Date - 2022-07-19T22:57:15+05:30 IST

రైళ్లలో విక్రయించే ఆహారం, శీతల పానీయాలపై భారతీయ రైల్వే శాఖ (Indian Railway) ప్రయాణికులకు కాస్తంత ఊరట కల్పించింది. మీల్స్, కూల్ డ్రింక్స్‌ను ముందుగా..

Railways: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఇకపై ఆ 50 రూపాయలు కట్టక్కర్లేదు..!

న్యూఢిల్లీ: రైళ్లలో విక్రయించే ఆహారం, శీతల పానీయాలపై భారతీయ రైల్వే శాఖ (Indian Railway) ప్రయాణికులకు కాస్తంత ఊరట కల్పించింది. మీల్స్, కూల్ డ్రింక్స్‌ను ముందుగా బుక్ చేసుకోని వారికి విక్రయించిన సందర్భంలో గతంలో ఆన్-బోర్డ్ సర్వీస్ ఛార్జ్ (On-Board Service Charge) పేరుతో రైల్వే 50 రూపాయలు అదనంగా వసూలు చేసేది. తాజాగా ఈ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. టీ (Tea), కాఫీ (Coffee) కూడా ప్రయాణికులందరికీ ఒకే ధరకు విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది. రాజధాని (Rajadhani), దురంతో (Duronto), శతాబ్ది (Shatabdi) వంటి ప్రీమియమ్ రైళ్లలో భోజనం, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటివి ముందుగా బుక్ చేసుకోకుండా ప్రయాణంలో అప్పటికప్పుడు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరట కల్పించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గత నిబంధన ప్రకారం ప్రీమియమ్ రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు టికెట్‌తో పాటు మీల్స్ బుక్ చేసుకోకపోతే ప్రయాణం సమయంలో మీల్స్ కొనుగోలు చేయాలంటే 50 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. 20 రూపాయలకు విక్రయించే టీ, కాఫీ కావాలన్నా అదనంగా 50 రూపాయలు కట్టాల్సిందే.



అంటే.. టీ, కాఫీ తాగాలన్నా గానీ సర్వీస్ ఛార్జ్‌తో కలిపి 70 రూపాయలు చెల్లించక తప్పేది కాదు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ముందుగా బుక్ చేసుకోకపోయినప్పటికీ టీ లేదా కాఫీ 20 రూపాయలకే లభిస్తుంది. అయితే.. ఆన్‌బోర్డ్ సర్వీస్ ఛార్జీలను రద్దు చేసినప్పటికీ స్నాక్స్, లంచ్, డిన్నర్ మీల్స్‌కు 50 రూపాయలను అదనంగా జోడించడం కొసమెరుపు. అందువల్ల.. ఈ రద్దయిన 50 రూపాయల సర్వీస్ ఛార్జ్ కేవలం టీ, కాఫీ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఊరట కల్పించనుంది. గతంలో బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.105, లంచ్ రూ.185, స్నాక్స్ 90 రూపాయలు ఉండేది. ఇకపై.. జోడించిన ఈ 50 రూపాయలతో కలిపి రూ.155, రూ.235, రూ.140 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-07-19T22:57:15+05:30 IST