రైల్వేకోడూరు మామిడికి ఇతర రాష్ట్రాల దెబ్బ

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచి మామిడికాయలు ఎక్కువగా వస్తుండటంతో రైల్వేకోడూరు మామిడికి గట్టి దెబ్బ తగిలింది.

రైల్వేకోడూరు మామిడికి  ఇతర రాష్ట్రాల దెబ్బ
మార్కెట్‌ యార్డులో రాసిపోసిన పులిహోరా కాయలు

మధ్యస్తంగా ధరలు

రోజూ 10 లారీల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి


రైల్వేకోడూరు, మే 21:  ఇతర రాష్ట్రాల నుంచి మామిడికాయలు ఎక్కువగా వస్తుండటంతో రైల్వేకోడూరు మామిడికి గట్టి దెబ్బ తగిలింది. ఈ ఏడాది అరకొరగా ఉన్న కాయలకు మంచి ధర ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ మధ్యస్తంగా ఉన్న ధరలతో పాటు మార్కెట్‌ కూడా సరిగ్గా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి, దిండిగల్‌, నతమ్‌, చమోటా, కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసరపూర్‌, చిక్‌బల్లాపూర్‌, కోలార్‌, తెలంగాణలోని పెబ్బేరు, జగిత్యాల, కొత్తకోట, వరంగల్‌, జడ్చర్ల, ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడ, విసన్నపేట, నూజివీడు, తిరుపతి, అనంతపురం, దామలచెరువు, తిరుపతి రాయచోటి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఒకేసారి మామిడికాయలు మార్కెట్‌లోకి రావడంతో రైల్వేకోడూరు మామిడిని దెబ్బతీసింది. దీంతో ధరలు కూడా మధ్యస్తంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే రైల్వేకోడూరు మామిడికి పెట్టింది పేరు. వాతావరణ పరిస్థితుల వల్ల మామిడి దిగుబడి తగ్గింది. అకాల వర్షాలు రైతుల కొంప కొల్లేరు చేస్తున్నాయి. పెనుగాలులు వీచడంతో మామిడికాయలు నేలరాలిపోతున్నాయి. మొదట్లో వచ్చిన పూత వల్ల కొన్ని తోటల్లో దిగుబడులు వచ్చాయి. ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కాయలు మార్కెట్‌లోకి రావడంతో రైల్వేకోడూరు మామిడిని దెబ్బతీసింది. బేనీషా టన్ను రూ. 20వేల నుంచి రూ.25 వేలు, పులిహోరా రూ.15 వేల నుంచి రూ.16 వేలు, తోతాపూరి రూ.13 వేల నుంచి రూ.14 వేలు, ఖాదర్‌ రూ.25 వేల నుంచి 26 వేలు, రుమాణి రూ.14 నుంచి రూ.15 వేలు, మల్లిక రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. ప్రతిరోజూ 10 లారీల్లో కాయలను ఎగుమతి చేస్తున్నారు. రైల్వేకోడూరు ప్రైవేటు మార్కెట్‌లో 75 మండీలు ఉన్నాయి. ప్రస్తుతం 10 మండీల వ్యాపారులే వ్యాపారం సాగిస్తున్నారు. గుత్తి, గుంతకల్‌, పత్తికొండ, అనంతపురం, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చినా వారికి అంతంతమాత్రంగానే పనులు దొరుకుతున్నాయి. ప్రతి ఏటా రూ.200 కోట్లు వ్యాపారం సాగుతుంది. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.


ధరలు ఆశాజనకంగా ఉంటాయనుకున్నాం..

- కస్తూరి రామచంద్రనాయుడు, రైతు, రైల్వేకోడూరు

మామిడి దిగుబడులు తక్కువగా ఉండటంతో ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఆశించాము. వాతావరణ పరిస్థితులు మామిడి రైతులను కుప్పకూల్చాయి. ధరలు మధ్యస్తంగా ఉండడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడావచ్చే అవకాశం లేదు. ఇక పై ధరలు పెరిగితే రైతులు కోలుకోనే పరిస్థితి ఉంటుంది. కాయలకు మంగు పట్టింది. దీంతో పచ్చడికి పంపించాల్సి వచ్చింది.


ఇతర రాష్ట్రాల కాయలతోనే దెబ్బ..

- సర్ధార్‌, మామిడి వ్యాపారి, రైల్వేకోడూరు

ఇతర రాష్ట్రాల కాయలు ముందస్తుగా రావడం, రైల్వేకోడూరు ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ధరలు మధ్యస్తంగా ఉన్నాయి. బేనీషా రకం మామిడి పూర్తిగా ముదరలేదు. కొన్ని రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నాము.

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST