రైలు బోగీల్లో ఐసోలేషన్ వార్డులు?.. ఆలోచనలో రైల్వేశాఖ

ABN , First Publish Date - 2020-03-26T20:42:00+05:30 IST

రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా ఇవ్వాలని రేల్వే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రైలు బోగీల్లో ఐసోలేషన్ వార్డులు?.. ఆలోచనలో రైల్వేశాఖ

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. భారత్ లో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 14 వరకు పాసింజర్ రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పుడు రైల్వేశాఖ మరో కొత్త నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందట. అదేంటంటే ఆగిపోయిన రైళ్ల బోగీలను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా అందివ్వాలని. ఈ విషయాన్ని రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ మధ్య జరిగిన సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. ఈ మీటింగ్ లో వివిధ రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారట. రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా ఇవ్వాలని వీరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సరైన వైద్య సదుపాయాలు లేని ప్రాంతాలకు కూడా వైద్యసదుపాయలను అందించవచ్చు. దీనికి కారణం దేశవ్యాప్తంగా రైల్వేశాఖ విస్తరించి ఉంది. ప్రతిరోజూ 13వేలపైగా రైళ్లు నడిచే భారత్ లో.. రైళ్లను ఆస్పత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు.


ఈ కోచ్ లలో టాయిలెట్లు కూడా ఉన్నందున ఐసోలేషన్ వార్డులుగా కూడా ఉపయోగించవచ్చని చెప్తున్నారు. అలాగే రైళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించే అంబులెన్సులను కూడా ప్రభుత్వానికి అందించవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ.. కేబినెట్ మంత్రులతో మాట్లాడుతూ.. కరోనాపై పోరుకు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో కొత్త ఆలోచనలు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.


Updated Date - 2020-03-26T20:42:00+05:30 IST