ప్రయాణికులపై రైల్వే.. చార్జ్‌!

ABN , First Publish Date - 2020-12-05T06:28:35+05:30 IST

అన్‌లాక్‌లతో ప్రపంచం అంతా ప్రయాణిస్తున్నా..

ప్రయాణికులపై  రైల్వే.. చార్జ్‌!

పండుగలకూ రెగ్యులర్‌ రైళ్లు లేవు

స్పెషల్స్‌లో ‘తత్కాల్‌’ బాదుడు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

అన్‌లాక్‌లతో ప్రపంచం అంతా ప్రయాణిస్తున్నా.. రెగ్యులర్‌ రైళ్లు మాత్రం తిరగడం లేదు. వాటి స్థానంలో స్పెషల్‌ రైళ్లను నడుపుతూ, సామాన్య, మధ్య తరగతి ప్రజల నెత్తిన భారాలు మోపుతున్న రైల్వే.. రానున్న పండుగలకు కూడా ‘స్పెషల్‌’ దోపిడీకి సిద్ధమవుతోంది. పండుగల సమయంలో సైతం రెగ్యులర్‌ రైళ్లు నడపకపోగా, స్పెషల్‌ రైళ్లలో జనరల్‌ కోటా లేకపోవడంతో ఆందోళన చెందుతున్న ప్రయాణికులపై ‘ఫెస్టివల్‌ స్పెషల్స్‌’ పేరుతో తత్కాల్‌ భారం మోపటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 


రైల్వేలో పూర్తి వ్యాపార దృక్పథం

సేవా భావాన్ని రైల్వే మరిచిపోయింది. పక్కా వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తూ, పేదలకు రైల్వే ప్రయాణాన్ని దూరం చేస్తోంది. రైల్వేకు ఆదాయాన్ని ఇస్తున్న ప్రజలపై మరిన్ని భారాలు మోపడానికి సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. అన్ని రంగాల్లోనూ కొవిడ్‌ నిబంధనలను సడలించినా, రెగ్యులర్‌ రైళ్లను నడపకుండా, స్పెషల్స్‌ పేరుతో ప్రయాణికులను నిలువునా దోచుకొంటోంది. 

దేశమంతా అన్‌లాక్‌లతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నా, రైల్వే మాత్రం రెగ్యులర్‌ రైళ్ళ లాక్‌ తీయటం లేదు. కొవిడ్‌ భయంతోనే రెగ్యులర్‌ రైళ్లను తీయటం లేదనుకోవడానికీ లేదు. విజయవాడ డివిజన్‌ మీదుగా నడిచే రెగ్యులర్‌ రైళ్ల సంఖ్య 161 కాగా, ఇప్పుడు స్పెషల్స్‌ పేరుతో 150 వరకు రైళ్లను నడుపుతున్నారు. దీనినిబట్టి చూస్తే కొవిడ్‌ అనేది ఒక వంక మాత్రమే అని స్పష్టమవుతోంది. 

స్పెషల్‌ రైళ్లలో పేద, మధ్య తరగతి వర్గాలు ప్రయాణించే జనరల్‌ బోగీలు ఉండడం లేదు. ఈ రైళ్లలో రిజర్వేషన్‌ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. కమర్షియల్‌ స్టాఫ్‌ను ఖాళీగా కూర్చోపెడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల్లో అత్యధికులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ తెలియదు. దీంతో వారికి స్పెషల్‌ రైళ్లలో ప్రయాణం దుర్లభంగా మారుతోందనే చెప్పాలి. పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సామాన్యులకు పాసింజర్‌ రైళ్లు కూడా దూరమయ్యాయి. ఇదే సమయంలో సంక్రాంతికి రెండు నెలల ముందు నుంచే ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లను నడపాలని రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లు నిజంగానే స్పెషల్‌. వీటిలో ప్రయాణించాలంటే తత్కాల్‌ చార్జీలను చెల్లించగలగాలి. ప్రయాణికులు అత్యవసరంగా ప్రయాణం చేయాల్సివచ్చినపుడు రెట్టింపు చార్జీ చెల్లించి తీసుకునే టికెట్టే ‘తత్కాల్‌.’ 

జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నిడమానూరు తదితర స్టేషన్ల నుంచి ఉద్యోగులు అధికంగా రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి ఇప్పుడు రైళ్లే లేవు. స్పెషల్‌ రైళ్లు ఆయా స్టేషన్లలో ఆగవు. మచిలీపట్నం నుంచి కొత్తగా ఒకే ఒక్క స్పెషల్‌ రైలును నడుపుతున్నారు. జనరల్‌ బోగీలు లేవు. అంతకు ముందు రూ.75లోపు చార్జీతోనే మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చేవారు. ఇప్పుడు రూ.150 చెల్లించి ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. లేదంటే అంతే ధర చెల్లించి స్పెషల్‌ రైల్లో ప్రయాణించాలి. ప్రజలకు ఇది ఇంత భారమో రైల్వే ఆలోచించటం లేదు. 


ఎవరికి పండగ?

ఈ నెలలో క్రిస్మస్‌, వచ్చే నెలలో సంక్రాంతి. ఈ రెండు పండగలూ రైల్వేకు ఫుల్‌ సీజన్‌. అలాంటి సీజన్‌ను ఎన్‌ క్యాష్‌ చేసుకునేందుకు సహజంగానే స్పెషల్‌ రైళ్లను నడుపుతుంటారు. వీటిలో సగం చార్జీని అదనంగా వసూలు చేస్తారు. కానీ, రెండు నెలల ముందు నుంచే ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్ల పేరుతో రైల్వేశాఖ రెట్టింపు చార్జీతో కూడిన తత్కాల్‌ చార్జీలను వసూలు చేస్తోంది. ఇది పండుగకు ముందు ఉన్న రద్దీని నివారించేందుకు కాదు. లేని డిమాండ్‌ను సృష్టించి, సాధారణ ప్రయాణికులను దోచుకోవడమే. పండగల సమయంలోనైనా రెగ్యులర్‌ రైళ్లను నడుపుదామన్న ఆలోచన లేకుండా స్పెషల్స్‌ పేరుతో ప్రజలపై భారాలు మోపడంపై ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-12-05T06:28:35+05:30 IST