భూమాయ

ABN , First Publish Date - 2021-06-21T06:51:47+05:30 IST

కడప-రేణిగుంట రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తుండడంతో హైవే చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఆనలైనలో చకచకా పేర్లు మారి పరులపాలవుతున్నాయి. అసైనమెంటు కమిటీ లేకుండానే వందలాది ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

భూమాయ
కడప-రేణిగుంట రహదారి

కడప-రేణిగుంట రహదారి విస్తరణతో భూములకు భారీ డిమాండ్‌

ప్రభుత్వ భూములపై పలువురు బడాబాబుల కన్ను

నిషేధిత భూముల్లో పట్టాలు

అక్రమార్కులకు సిద్దవటం రెవెన్యూ అధికారుల సహకారం


జిల్లాలో ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు.. కొందరు గద్దల్లా వాలిపోతున్నారు. జానెడు జాగా అయినా సరే వేసెయ్‌ పాగా అంటూ ఆక్రమించేస్తున్నారు. ఇది మారుమూల పల్లె నుంచి కడప సిటీ వరకూ జరుగుతున్న తంతు. కొందరు రాజకీయ నేతల హస్తం, రెవెన్యూ అండతో ప్రభుత్వ భూములు కర్పూరంలా హారతవుతున్నాయి. అయితే ఇప్పుడు భూఆక్రమణకు కడప-రేణిగుంట జాతీయ రహదారి వంతైంది. ఇక్కడ వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు రాజకీయ నేతల వశం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. 


కడప, జూన 20 (ఆంధ్రజ్యోతి): కడప-రేణిగుంట రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తుండడంతో హైవే చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఆనలైనలో చకచకా పేర్లు మారి పరులపాలవుతున్నాయి. అసైనమెంటు కమిటీ లేకుండానే వందలాది ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. పోరంబోకు, వంక పోరంబోకు, పీవోటీ నిషేధిత భూములకు సైతం పట్టాలు ఇస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిద్దవటం తహసీల్దారు కార్యాలయ పరిఽధిలో ప్రభుత్వ భూముల దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ వ్యవసాయానికి యోగ్యవంతమైన సారవంత భూములుండడం, కడప-రేణిగుంట ప్రధాన రహదారి ఉండడంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా గ్రామకంఠం, వంకపోరంబోకు ఉన్నప్పటికీ తెల్లారేసరికి ప్రభుత్వ భూములన్నీ నేతల చేతుల్లోకి వాలిపోతున్నాయి. కడప-రేణిగుంట పరిధిలో సిద్దవటం మండలంలోని పెద్దపల్లె రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ దురాక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. రెవెన్యూలో పనిచేసే కొందరు అక్రమాలకు సహకరిస్తుండడంతో భూములు అన్యాక్రాంతమవుతున్నాయనే విమర్శలున్నాయి. సిద్దవటం మండలంలోని పెద్దపల్లె రెవెన్యూ విలేజీ కడప-రేణిగుంట జాతీయ రహదారి సమీపంలో ఉంది. ఇక్కడ ఎకరా రిజిస్టరు భూమి అయితే రహదారికి సమీపంలో అయితే రూ.కోటి వరకు పలుకుతోంది. ప్రభుత్వ భూమి అయితే రూ.40 లక్షలు పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడున్న రోడ్డు నాలుగు వరుసల రహదారిగా విక్రయిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది. జాతీయ రహదారి మారుస్తుండడం, భూమి విలువ పెరుగుతుండడంతో రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాలపై కొందరు కన్నేసినట్లు చెబుతారు. పెద్దపల్లె రెవెన్యూ పరిధిలో సర్వే నెం.1028/1, 1028/2, 1028/3, 903-1ఎ, 983/1బి, 983/1సి, 982/2, 3, 4, 5తో పాటు 1032/2, 1032/1, 1032/3తో పాటు 1031/1, 1031/2, 1031/3, 1031/4, 1030/2, 1030/3, 1030/1 మరికొన్ని సర్వే నెంబర్లు పీవోటీ (నిషేధిత భూముల)జాబితాలో ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు సర్వే నెంబర్లలో వేరే వారి పేర్లు నమోదయ్యాయి. రెవెన్యూ ప్రకారం పీవోటీ భూముల్లో పట్టాలు ఇవ్వకూడదు. అయితే ఇవన్నీ సాగు భూములుగా సాగు చేసేందుకు పట్టాలు ఇచ్చారు. కొందరికి 1.99 ఎకరాలు, 1.5 ఎకరాలు, 1.98 ఎకరాలు, 2.99 ఎకరాలు, 5 ఎకరాల చొప్పున కేటాయించి ఆనలైనలో నమోదు చేశారు. 


భారీగా వసూళ్లు

పీవోటీ భూముల బదలాయింపుల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ ఎకరా 30 నుంచి రూ.40 లక్షలు పలుకుతుండడంతో కొందరు భారీగానే అధికార యంత్రాంగానికి ముట్టచెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మంచి ధర పలుకుతుండడంతో అఽధికారులు చెప్పిన మేరకు ఆమ్యామ్యాలు ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం అక్కడ చర్చనీయాంశంగా మారింది. 


రికార్డులు పరిశీలించి చెబుతా

-రామకుమారి, తహసీల్దార్‌, సిద్దవటం

పీవోటీ భూముల విషయమై ‘ఆంధ్రజ్యోతి’ సిద్దవటం తహసీల్దారు రామకుమారిని ఫోనులో సంప్రదించగా పీవోటీ భూముల పట్టాల విషయాన్ని ప్రస్తావించగా రికార్డులు పరిశీలించి చెబుతానన్నారు.


ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు

- దాసరి వెంకటసుబ్బయ్య, దిగువపేట, సిద్దవటం మండలం

సిద్దవటం మండలంలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కావాల్సిన వారికి కట్టబెడుతున్నారు. రికార్డులన్నీ ట్యాంపరింగ్‌ చేశారు. పెద్దపల్లె రెవెన్యూ పరిధిలో పీవోటీ భూములను నిబంధనలకు విరుద్దంగా ఆనలైన చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ల్యాండ్‌ రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి, కలెక్టరుకు, విజిలెన్స ఎనఫోర్స్‌మెంటుకు ఫిర్యాదు చేశాను.

Updated Date - 2021-06-21T06:51:47+05:30 IST