చట్టాలకు లోబడే పోడు భూములకు పట్టాలు

ABN , First Publish Date - 2022-09-22T05:14:26+05:30 IST

ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయంచేసుకుని బతుకుతున్న పేదవారికి చివరి అవకాశంగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అటవీశాఖ చట్టాల ప్రకారమే పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

చట్టాలకు లోబడే పోడు భూములకు పట్టాలు
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

- పోడు భూముల పట్టాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి
- అడవుల నరికివేత జరగకూడదనేదే సీఎం అభిప్రాయం
- ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చేందుకు కేసీఆర్‌ సిద్ధం
- అటవీ భూములను కబ్జాచేసే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి
- అడవులపై, భూములపై అటవీ అధికారులు డేగకన్నుతో పర్యవేక్షించాలి
- మంత్రి ప్రశాంత్‌రెడ్డి


కామారెడ్డి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయంచేసుకుని బతుకుతున్న పేదవారికి చివరి అవకాశంగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అటవీశాఖ చట్టాల ప్రకారమే పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల మంత్రి చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తు చేపట్టాల్సిన చర్యల గురించి అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకతపై మంత్రి అధికారులకు వివరించారు. పోడు భూముల పట్టాల విచారణ జరుగుతున్న సమయంలో అటవీ ప్రాంతాల్లోని ఏ ఒక్కచెట్టు కూడా నరికివేతకు గురికాకుండా అడుగడుగునా బీట్‌ స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే బీట్‌ ఆఫీసర్‌లు, ఇతర సిబ్బంది నిరంతరం డేగ కన్నుతో నిఘా కొనసాగించాలన్నారు. అవసరమైతే పోలీసుశాఖ సహాయం తీసుకోవాలన్నారు. అటవీ భూములను కబ్జాచేసినా, చెట్లను నరికిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు ఆయా గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిక ప్రాఽధాన్యత ఇస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే మరెక్కడ లేని విధంగా రాష్ట్రంలో 2021 లెక్కల ప్రకారం 6 శాతం అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. మరో 3 శాతం పెంచి 9 శాతం వరకు పెంచుకోగలిగితే వర్షాభావ పరిస్థితులను నివారించుకోవచ్చన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పోడుభూముల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు గ్రామ, డివిజన్‌ కమిటీల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తును కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్‌  గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎఫ్‌వో నిఖిత, అదనపు ఎస్పీ అనోన్య, అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజిబొద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T05:14:26+05:30 IST