మూడో లైన్‌కు..మెలిక

ABN , First Publish Date - 2022-05-23T05:32:12+05:30 IST

విజయవాడ - గూడూరు రైల్వే మూడో లైనుకు జిల్లాలో అడ్డంకులు తలెత్తాయి. ఎక్కడెక్కడ అయితే ప్రైవేటు భూమి అవసరం అవుతుందో ఆ వివరాలను రైల్వేశాఖ రెవెన్యూ డిపార్టుమెంట్‌కు అందించినా అడుగు ముందుకు పడటం లేదు.

మూడో లైన్‌కు..మెలిక
విజయవాడ - గూడూరు మూడో లైను నిర్మాణ పనులు

విజయవాడ - గూడూరు రైల్వే మూడో లైనుకు  ఆటంకాలు

24.499 ఎకరాల భూమిని సేకరించేందుకు రెవెన్యూ ఆపసోపాలు

రైల్వే నగదు డిపాజిట్‌ చేసినా ముందుకు కదలని ప్రక్రియ


గుంటూరు, మే22(ఆంధ్రజ్యోతి): విజయవాడ - గూడూరు రైల్వే మూడో లైనుకు జిల్లాలో అడ్డంకులు తలెత్తాయి. ఎక్కడెక్కడ అయితే ప్రైవేటు భూమి అవసరం అవుతుందో ఆ వివరాలను రైల్వేశాఖ రెవెన్యూ డిపార్టుమెంట్‌కు అందించినా అడుగు ముందుకు పడటం లేదు. రెవెన్యూ శాఖ కోరిన విధంగా నగదుని డిపాజిటివ్‌ చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించి ఇవ్వలేకపోయారు. దీంతో మూడో లైను నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే రైల్వే భూమి ఉందో అక్కడ చకచకా పనులు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

హౌరా - చెన్నై రైలు మార్గంలో భాగమైన విజయవాడ - గూడూరు మధ్యన ఇప్పటికే డబ్లింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఈ మార్గం బాగా రద్దీది కావడంతో గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకొన్న కేంద్ర ప్రభుత్వం డెడికేటర్‌ ఫ్రైట్‌ కారిడార్‌ లైన్‌ని మంజూరు చేసింది. దీనికి సంబంధించి జిల్లాలో మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడిలో 1.665 ఎకరాలు, తాడేపల్లి మండలంలోని తాడేపల్లిలో 0.025 ఎకరాలు, తెనాలిలోని కొలకలూరులో 0.585, తెనాలిలో 0.204, దుగ్గిరాల ఫేజ్‌-1లో 0.28, ఫేజ్‌-2లో 21.29, మోరంపూడిలో 0.45 ఎకరాల భూమి అవసరం అవుతుందని రైల్వే శాఖ నివేదించింది. అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉన్న బేసిక్‌ విలువ ప్రకారం రెవెన్యూ శాఖ కోరిన విధంగా రూ.4.95 కోట్లను ఇప్పటికే డిపాజిట్‌ కూడా చేసింది. 

కాగా దుగ్గిరాల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన బేసిక్‌ విలువ ప్రకారం భూములను రైల్వేకి ఇచ్చేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అక్కడ ఎకరం భూమి విలువ రూ.కోటి వరకు ఉంటే రెవెన్యూ శాఖ చాలా తక్కువగా చూపించింది. దాంతో రైతులతో ఒప్పందం చేసుకొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎంవో అదనపు కార్యదర్శి వచ్చి ఈ అంశాన్ని కూడా సమీక్షించారు. తెనాలి సబ్‌ కలెక్టర్‌ని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన రైల్వే మూడో లైను నిర్మాణం జరుగుతున్నందున రైతులతో సంప్రదింపులు జరిపి ఒప్పించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి రైల్వేకు స్వాధీనం చేయాలన్నారు. 

 

Updated Date - 2022-05-23T05:32:12+05:30 IST