ఈ వాటర్ బాటిల్ తెలుసుగా.. ఇప్పుడు ఎంతపని జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-19T05:59:34+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ‘రైల్‌ నీర్‌’ ప్రాజెక్టును కావాలనే నీరు గారుస్తున్నారా? ప్రాజెక్టును తాత్సారం చేయడం వల్ల ఐఆర్‌సీటీసీకి..

ఈ వాటర్ బాటిల్ తెలుసుగా.. ఇప్పుడు ఎంతపని జరిగిందంటే..

దశాబ్ద కాలం నాటి ‘రైల్‌ నీర్‌’ను నీరుగార్చే యత్నం

ప్రాజెక్టును అందుబాటులోకి తేవడంలో అంతులేని తాత్సారం

ప్రైవేట్‌ బాటిళ్ల కమీషన్ల కోసమేనా? 

ఐఆర్‌సీటీసీపై కలుగుతున్న అనేక అనుమానాలు


కేంద్ర ప్రభుత్వ ‘రైల్‌ నీర్‌’ ప్రాజెక్టును కావాలనే నీరు గారుస్తున్నారా? ప్రాజెక్టును తాత్సారం చేయడం వల్ల ఐఆర్‌సీటీసీకి కలిగే ప్రయోజనమేంటి? అసలు కాంట్రాక్టు సంస్థ గుణ్‌రాజ్‌తో ఐఆర్‌సీటీసీ పంతం ఏంటి? ప్రైవేట్‌ వాటర్‌ బాటిళ్ల విక్రయం ద్వారా కమీషన్‌ దండుకోడానికే ఇలా చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్‌ కు పదేళ్ల కిందట మంజూరైన ఈ ప్రాజెక్టు ఇంతవరకు అందుబాటులోకి రాకపోవడం వెనుక కమీషన్ల కథ నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దశాబ్దకాలం కిందట కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌లో విజయవాడకు రైల్‌ నీర్‌ ప్రాజెక్టును కేటాయించింది. అయితే, ఈ ప్రాజెక్టును మంజూరు చేశారన్న ఆనందం రైల్వే ప్రయాణికులకు లేకుండా పోయింది. దీనివల్ల ప్రయాణికులకు సురక్షితమైన మంచినీరు అందుతుంది, తక్కువ ధరకు ప్యాకేజ్‌డ్‌ బాటిల్‌ లభిస్తుంది, రైల్వేకు నిర్వహణ వ్యయం కలిసొస్తుందన్న ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. కానీ, ఐఆర్‌సీటీసీ అధికారుల రూటే వేరుగా ఉంది. ప్రైవేట్‌ వాటర్‌ బాటిల్‌ కంపెనీల మత్తులో తూగుతున్నారు. ఫలితంగా నిధులున్నా బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయటానికి తాత్సారం చేస్తున్నారు.

 

ఆది నుంచీ అడ్డంకులే..

బెజవాడ డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా రైల్‌ నీర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లను మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు, కృష్ణాకు కావాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. చివరకు అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లాకే ఈ ప్రాజెక్టు దక్కింది. దీనిప్రకారం బాట్లింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఐఆర్‌సీటీసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఐఆర్‌సీటీసీ దాదాపు ఏడేళ్ల వరకూ తాత్సారం చేస్తూ వచ్చింది. విమర్శలు వ్యక్తం కావడంతో మల్లవల్లి పారిశ్రామికవాడలో ప్లాంటును కొన్నారు. గుణ్‌రాజ్‌ అనే సంస్థకు బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటును అప్పగించారు. అయితే, గుణ్‌రాజ్‌ సంస్థకు, ఐఆర్‌సీటీసీకి మధ్య సమన్వయం లోపించింది. దీంతో సంస్థ పనులు నిలుపుదల చేయగా, కాలాతీతమైంది. కరోనా కారణంగా మరికొంతకాలం పనులు ఆగాయి. ఐఆర్‌సీటీసీ నుంచి గుణ్‌రాజ్‌ సంస్థకు సహకారం లేకపోవడం వల్లే ఇలా జరుగుతూ వచ్చింది. బిల్లుల చెల్లింపుల్లో కూడా ఇబ్బందులు పెట్టారు. గుణ్‌రాజ్‌ను పనులు చేయనీయకుండా నిలువరించటం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేరతాయన్న భావనలో ఐఆర్‌సీటీసీ అధికారులు ఉన్నారని తెలుస్తోంది. ఎంత జాప్యం అయితే, అంతకాలం ప్రయాణికులు ప్రైవేట్‌ వాటర్‌ బాటిళ్లు కొంటారని, తద్వారా పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకోవచ్చని వారి ఆలోచన. అందుకే ఐఆర్‌సీటీసీ అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్లాంట్‌ను ఆపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ అధికారులు మాత్రం కాంట్రాక్టు సంస్థపైనే నెపం వేస్తున్నారు. వాస్తవానికి కాంట్రాక్టు సంస్థది వ్యాపారం. ప్లాంటుతో పాటు బాట్లింగ్‌ యూనిట్‌ మిషనరీ ఏర్పాటు చేసినందుకు రైల్వే నుంచి ఆ సంస్థకు డబ్బు వస్తుంది. డబ్బు వచ్చే పనిని ఆ సంస్థ ఎందుకు జాప్యం చేస్తుంది? దానివల్ల ఆ సంస్థకు నష్టం తప్ప లాభం ఉండదు కదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల కిందట ఐఆర్‌సీటీసీ అధికారులు కాంట్రాక్టు సంస్థపై వేటు వేశారు. బాట్లింగ్‌ యూనిట్‌ పనులు చేపట్టకుండా టెర్మినేట్‌ చేశారు. దీంతో ఈ పనుల్లో మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. విశాఖపట్నంలో మరో నెలలో ప్లాంట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలుండగా, ఇక్కడ మాత్రం కావాలనే జాప్యం చేస్తున్నారు. 


చెన్నై నుంచి వాటర్‌ బాటిళ్ల కొనుగోళ్లు

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని ఉమ్మడి కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరికోసం చెన్నై నుంచి ఐఆర్‌సీటీసీ వాటర్‌ బాటిళ్లను కొంటోంది. రైల్‌ నీర్‌ లభ్యత లేదన్న సాకుతో ప్రైవేట్‌ వాటర్‌ కంపెనీల నుంచి బాటిళ్లను కొంటున్నారు. ఇందుకోసం కమీషన్లు తీసుకుంటున్నారు. 


అన్ని ప్రైవేట్‌ వాటర్‌ బాటిళ్లే..

రైల్వేశాఖ మార్గదర్శకాలను గమనిస్తే రైల్వేస్టేషన్లు, రైళ్లలో.. అన్నింటా రైల్‌ నీర్‌ బాటిళ్లే కనిపించాలి. ప్రైవేట్‌ వాటర్‌ బాటిళ్లు కనిపించకూడదు. కానీ, విజయవాడ రైల్వే డివిజన్‌లో ప్రైవేట్‌ వాటర్‌ బాటిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాప్‌బ్రాండ్స్‌ నుంచి డబ్బా కంపెనీల వరకూ కనిపిస్తాయి. దీనిని బట్టి ఏ స్థాయిలో ఉల్లంఘనలు జరుగుతున్నాయో అర్థమవుతుంది.


తక్కువ ధరకు సురక్షిత నీరు అందేనా?

రైల్వే ప్రయాణికులకు తక్కువ ధరకు సురక్షిత మంచినీరు లభించాలంటే రైల్‌ నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు కావాల్సి ఉంది. ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన వాటర్‌ బాటిల్‌ లీటర్‌ రూ.20పైనే ఉంటుంది. అదే రైల్‌ నీర్‌ వాటర్‌ బాటిల్‌ అయితే రూ.15కే లభిస్తుంది. ప్లాంట్‌ ఇక్కడే ఏర్పాటుకావటం వల్ల ధర ఇంకా తగ్గుతుంది.



Updated Date - 2022-08-19T05:59:34+05:30 IST