రైలెక్కేద్దాం..!

ABN , First Publish Date - 2021-08-18T06:12:58+05:30 IST

కరో కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో క్రమక్రమంగా రైలు ప్రయాణాలకు డిమాండ్‌ పెరుగుతోంది.

రైలెక్కేద్దాం..!

రైలు ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌

12 రైళ్లకు అదనపు బోగీలు జోడిస్తున్న రైల్వే శాఖ

గుంటూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కరో కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో క్రమక్రమంగా రైలు ప్రయాణాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఒకదశలో ప్రయాణికుల స్పందన లేక ఇంచుమించు నెలన్నరపాటు పలు రైళ్లని రద్దు చేసిన రైల్వే శాఖ ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా అదనపు బోగీలను జోడిస్తోంది. స్లీపర్‌, సెకండ్‌ సిట్టింగ్‌ బోగీలలో ప్రయాణానికి ప్యాసింజర్లు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో వెయిటింగ్‌ లిస్టు ఎక్కువగా ఉండటంతో క్లియర్‌ చేసేందుకు అదనపు బోగీలు ఛార్టింగ్‌కు ముందు కేటాయిస్తున్నారు. దీని వలన వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులకు బెర్తులు/సీట్లు ఖరారు అవుతుండగా రైల్వేకి ఆదాయం కూడా పెరుగుతోంది. 

మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని ప్రస్తుతం రిజర్వుడ్‌ బోగీలతోనే నడుపుతున్నారు. సెకండ్‌ సిట్టింగ్‌, స్లీపర్‌, ఏసీ తరగతుల బోగీలతో పంపుతున్నారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణానికి ఇంకా టిక్కెట్‌లు జారీ చేయడం లేదు. కేవలం ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లకు మాత్రమే జనరల్‌ బోగీల్లో ప్రయాణానికి అనుమతిస్తున్నారు. కాగా విశాఖ, ధర్మవరం, హుబ్లీ, రాయగడ, నరసపూర్‌, యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఎక్కువగా డిమాండ్‌ కనిపిస్తోంది. సాఫ్టువేర్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యాన్ని క్రమక్రమంగా కంపెనీలు తీసేసి కార్యాలయాలకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దాంతో హైదరాబాద్‌కు జిల్లా నుంచి రాకపోకలు పెరిగాయి. దీంతో వెయిటింగ్‌ లిస్టు క్లియర్‌ చేయడానికి ఎస్‌ఈ1, డీఈ1 పేర్లతో బోగీలను జత చేస్తున్నారు. డెల్టా, నారాయణాద్రి, నరసాపూర్‌, శబరి వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని పండగ ప్రత్యేక రైళ్లుగా నడుపుతున్నారు. వాటికి తత్కాల్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిని కూడా సాధారణ రైళ్లుగా మార్పు చేస్తే టిక్కెట్‌ ఛార్జీలు తగ్గి ప్రయాణికుల ఆదరణ మరింత పొందే అవకాశం ఉన్నది. 


తొలగించిన స్టాపులు పునరుద్ధరిస్తే..


రైల్వే సమయపట్టిక సవరణలో భాగంగా గుంటూరు - సికింద్రాబాద్‌ మార్గంలో పలు రైళ్లకు రాత్రిపూట సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వేస్టేషన్లలో నిలుపుదల సౌకర్యం ఎత్తివేశారు. ఈ కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు రాత్రి వేళ రైలు ప్రయాణానికి దూరం కావాల్సి వస్తోంది. వాటిని పునరుద్ధరిస్తే మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2021-08-18T06:12:58+05:30 IST