టీకా పాలసీ మరో నోట్ల రద్దు లాంటిది: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-04-21T18:07:25+05:30 IST

దేశంలో 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందిందని మంగళవారం నాటి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ రెండవ దశపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ

టీకా పాలసీ మరో నోట్ల రద్దు లాంటిది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలోని 18 ఏళ్లు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని మంగళవారం దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అయితే ప్రధాని చేసిన ఈ వాగ్దానం నిజంగా పేదలకు ఉపయోగపడేది కాదని, ఇది పూర్తిగా కొద్ది మంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా టీకా పాలసీ.. నోట్ల రద్దు లాంటి నిర్ణయానికి ఏమాత్రం తీసిపోదని, పెద్ద నోట్లు మార్చుకోవడానికి సాధారణ ప్రజలు లైన్లలో వేచి ఉన్నట్లే టీకా కోసం కూడా భారీగా లైన్లు ఉండబోతాయని రాహుల్ అన్నారు.


బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ.. ‘‘కేంద్ర ప్రభుత్వ టీకా పాలసీ మరో నోట్లరద్దుకు ఎంత మాత్రం తక్కువ కాదు. సాధారణ ప్రజలు లైన్లలోనే ఉండిపోతారు. డబ్బు, ఆరోగ్యం, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివర్లో కొద్ది మంది వ్యాపారవేత్తలు మాత్రమే లాభపడతారు’’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.


కాగా, దేశంలో 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందిందని మంగళవారం నాటి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ రెండవ దశపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1 నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-21T18:07:25+05:30 IST