కూచ్ బేహార్ కాల్పులపై నోరు జారిన బీజేపీ నేత... ఈసీ వేటు!

ABN , First Publish Date - 2021-04-13T22:02:13+05:30 IST

కూచ్ బేహార్ కాల్పులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రాహుల్ సిన్హాపై ఈసీ సీరియస్ అయ్యింది....

కూచ్ బేహార్ కాల్పులపై నోరు జారిన బీజేపీ నేత... ఈసీ వేటు!

కోల్‌కతా: కూచ్ బేహార్ కాల్పులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రాహుల్ సిన్హాపై ఈసీ సీరియస్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన చేస్తున్న ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర బలగాలు ‘‘మరింత దృఢంగా ఉంటే’’ నలుగురికంటే ఎక్కువ మందిని కాల్చేవారంటూ ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. కూచ్ బేహార్ జిల్లా సీతల్‌కూచి ప్రాంతంలో ఓ పోలింగ్ బూత్‌పై కొందరు దాడిచేశారంటూ సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో... నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సోమవారం రాహుల్ సిన్హా స్పందిస్తూ.. ‘‘ కేంద్ర బలగాలు దృఢంగా ఉన్నట్టయితే, రిగ్గింగ్‌ను అడ్డుకునే క్రమంలో, నలుగురికంటే ఎక్కువ... అవసరమైతే ఏడు లేదా ఎనిమిది మందిని కాల్చి చంపేవారు...’’ అని వ్యాఖ్యానించారు. దీంతో హార్బా నుంచి పోటీ చేస్తున్న ఆయనపై అధికార తృణమూల్ కాంగ్రెస్, వామ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిన్హా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... అలాంటి నాయకులపై రాజకీయ నిషేధం విధించాలన్నారు. మరోవైపు కూచ్ బేహార్ కాల్పులపై ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌కి సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది. ‘‘ఆకతాయిలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే కూచ్ బేహార్ లాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయి...’’ అంటూ ఘోష్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-04-13T22:02:13+05:30 IST