రాహుల్‌ షో

ABN , First Publish Date - 2021-12-27T10:02:03+05:30 IST

రాహుల్‌ షో

రాహుల్‌ షో

సెంచూరియన్‌లో సెంచరీ

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 272/3

రాణించిన మయాంక్‌

దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు


సెంచూరియన్‌: చరిత్రాత్మక సిరీస్‌ కోసం బరిలోకి దిగిన భారత జట్టు తొలి టెస్టు.. తొలి రోజే అదరగొట్టింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (248 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 122 బ్యాటింగ్‌) సూపర్‌ సెంచరీతో తన ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. వ్యూహాత్మక ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు ఆదివారం తొలి రోజే శతకం బాదేశాడు. దీంతో ఆట ముగిసే సమయానికి భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (123 బంతుల్లో 9 ఫోర్లతో 60) అర్ధసెంచరీ సాధించగా.. కోహ్లీ (35) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. క్రీజులో రాహుల్‌తో పాటు రహానె (40 బ్యాటింగ్‌) ఉన్నాడు. ఎన్‌గిడికి మూడు వికెట్లు దక్కాయి.


ఓపెనర్ల ఆధిపత్యం : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ శుభారంభం అందించారు. పిచ్‌ సవాల్‌ విసురుతున్నా క్రమశిక్షణాయుత బ్యాటింగ్‌తో  అద్భుత పునాది వేశారు. తొలి సెషన్‌లో ఈ జోడీ పట్టుదల కారణంగా వికెట్‌ కోల్పోకుండా జట్టు 83 పరుగులు సాధించింది. కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరూ చక్కటి సమన్వయంతో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నారు. అయితే మయాంక్‌ 36 పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కీపర్‌ డికాక్‌ అందుకోలేకపోయాడు.


మయాంక్‌ వివాదాస్పద రీతిలో: రెండో సెషన్‌లో దక్షిణాఫ్రికా పోటీలోకొచ్చింది. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని సఫారీ పేసర్లు నిలకడగా బంతులు వేశారు. ఈ క్రమంలో 41వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఎన్‌గిడి భారత్‌ను దెబ్బ తీశాడు. అర్ధసెంచరీతో ఊపు మీదున్న మయాంక్‌ను ముందు ఎల్బీగా అవుట్‌ చేశాడు. అయితే అంపైర్‌ నాటౌట్‌గా ప్రటించినా దక్షిణాఫ్రికా రివ్యూకు వెళ్లింది. బంతి లెగ్‌ స్టంప్‌ పైనుంచి వెళుతున్నట్టు కనిపించినా.. రీప్లేలో వికెట్‌ను తాకుతున్నట్టు స్పష్టమైంది. కానీ దీన్ని అంపైర్‌ కాల్‌కు వదిలేయకుండా, థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడంతో మయాంక్‌ నిరాశ చెందాల్సి వచ్చింది. దీంతో తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక తర్వాతి బంతికే పుజారను ఎన్‌గిడి డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత అర్ధసెంచరీ పూర్తి చేసిన రాహుల్‌తోపాటు కోహ్లీ మరో వికెట్‌ పడకుండా టీ బ్రేక్‌కు వెళ్లారు.

రాహుల్‌ శతకం : చివరి సెషన్‌లో భారత్‌ కోహ్లీ వికెట్‌ మాత్రమే కోల్పోయింది. ఆత్మవిశ్వాసంతో కనిపించిన కెప్టెన్‌ పేలవ షాట్‌కు ప్రయత్నించి ఎన్‌గిడికే చిక్కాడు. అయితే అప్పటికే మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం చేరింది. ఇక తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన రహానె ఫోర్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ సాగించాడు. అటు రాహుల్‌ ఓ ఫోర్‌తో విదేశాల్లో తన ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇదే జోరుతో రోజు ముగిసే వరకు రాహుల్‌, రహానె మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 

డెస్మండ్‌ టుటు మృతికి నివాళి: దక్షిణాఫ్రికా ప్రఖ్యాత ఆర్చి బిషప్‌ డెస్మండ్‌ టుటు మృతికి భారత్‌తో పాటు ఆ దేశ ఆటగాళ్లు ఘనంగా నివాళి ప్రకటించారు. తొలి రోజు ఆట ఆరంభానికి ముందు వరుస క్రమంలో నిలిచిన క్రికెటర్లు, అంపైర్లు నిమిషం పాటు మౌనం పాటించారు. 

ప్రతీ దేశంలోనూ శతకం..: రాహుల్‌ తాను ఆడిన ప్రతీ దేశంలోనూ శతకాలు పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌లో రెండు సెంచరీలు చేసిన అతడు.. ఆసీస్‌, భారత్‌, శ్రీలంక, విండీస్‌ తాజాగా దక్షిణాఫ్రికాలోనూ ఈ ఫీట్‌ను పూర్తి చేసుకోవడం విశేషం. కెరీర్‌ మొత్తంలో ఏడు సెంచరీలు సాధించాడు.


టెస్టుల్లో అత్యధిక టాస్‌లు (67 మ్యాచ్‌ల్లో 30 సార్లు) గెలిచిన భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బ్యాటింగ్‌) 122; మయాంక్‌ (ఎల్బీ) ఎన్‌గిడి 60; పుజార (సి) పీటర్సన్‌ (బి) ఎన్‌గిడి 0; కోహ్లీ (సి) ముల్డర్‌ (బి) ఎన్‌గిడి 35; రహానె (బ్యాటింగ్‌) 40; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 90 ఓవర్లలో 272/3. వికెట్ల పతనం: 1-117, 2-117, 3-199; బౌలింగ్‌: రబాడ 20-5-51-0; ఎన్‌గిడి 17-4-45-3; జాన్సెన్‌ 17-4-61-0; ముల్డర్‌ 18-3-49-0; కేశవ్‌ మహరాజ్‌ 18-2-58-0.

Updated Date - 2021-12-27T10:02:03+05:30 IST