Abn logo
Aug 6 2021 @ 03:50AM

అమరావతికి రాహుల్‌ మద్దతు ప్రకటించాలి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి పద్మశ్రీ విజ్ఞప్తి


న్యూఢిల్లీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత 600 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ అండగా నిలవాలని ఏపీసీసీ నేత సుంకర పద్మశ్రీ విజ్ఞప్తి చేశారు. ఆమె గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విచ్ఛిన్నకర ధోరణిని, రైతులను వేధిస్తున్న తీరును వివరించారు. ప్రభుత్వ తీరుపై ఆవేదనతో 150 మంది రైతులు గుండెపోటుతో మరణించారని తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫున రాహల్‌ గాంధీ మద్దతు ప్రకటిస్తే రైతులు, బాధితుల్లో మనోస్థైర్యం కలుగుతుందని పద్మశ్రీ చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో, పోలవరం ప్రాజెక్టు నిధులు, నిర్వాసితుల పరిహారం, పునరావాస ప్యాకేజీలపై పార్లమెంటులో పోరాటానికి ఏఐసీసీ కేంద్ర కమిటీ విధానపరంగా మద్దతివ్వాలని పద్మశ్రీ విజ్ఞప్తి చేశారు. ఆమెతో రాష్ట్ర కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ జెట్టి గుర్నాఽథం, రాజధాని రైతు జీ చంటి పాల్గొన్నారు.


‘అమరావతి’కి మద్దతివ్వండి

ఎంపీ నవనీత్‌ కౌర్‌ను కోరిన అమరావతి మహిళా రైతులు

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమరావతి మహిళా రైతులు గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను ఆమెకు వివరించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 600 రోజుల నుంచి రైతులు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. సాక్షాత్తు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిలో గత ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చుచేసి అనేక భవనాలు నిర్మించగా.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు మూడు రాజధానుల విధానంతో అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రచేస్తుందన్నారు. తమ ‘అమరావతి’ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరాగా, ఎంపీ కౌర్‌ తన సంఘీభావం తెలిపారు. కౌర్‌తో భేటీ అయిన వారిలో శ్రీదే వి, శైలజ, యుగంధర్‌ తదితరులు ఉన్నారు.


‘అమరావతి’ పుస్తకావిష్కరణ

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై ‘ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ అమరావతి’ అనే పుస్తకాన్ని ఎంపీ రఘురామరాజు ఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమరావతి మహిళా జేఏసీ నేత, కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ పుస్తకం ప్రతిని మహిళా రైతులు ఎంపీ నవనీత్‌కౌర్‌కు అందించారు.