డబుల్‌ రోల్‌ కుదరదు!

ABN , First Publish Date - 2022-09-23T07:32:28+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. గురువారం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో కీలక ఘట్టం మొదలైంది. సోనియాగాంధీ మద్దతుతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్‌ సీఎం అశోక్‌

డబుల్‌ రోల్‌ కుదరదు!

గహ్లోత్‌కు రాహుల్‌ షాక్‌!..

రాజస్థాన్‌ సీఎంగా వైదొలగక తప్పదు?

అప్పుడా పదవి సచిన్‌ పైలట్‌కే!..

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

రేపటి నుంచి 30 వరకు నామినేషన్లు.. పోటీ చేసేది లేదన్న రాహుల్‌

బరిలో గహ్లోత్‌, థరూర్‌, దిగ్విజయ్‌తోపాటు కమల్‌నాథ్‌, మనీశ్‌ తివారీ కూడా!


కోచి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. గురువారం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో కీలక ఘట్టం మొదలైంది. సోనియాగాంధీ మద్దతుతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌.. అధ్యక్షుడిగా గెలిచినా కొన్నాళ్లు ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని ఆశపడుతున్నారు. ఆయన ఆశలపై అగ్రనేత రాహుల్‌గాంధీ నీళ్లు గుమ్మరించారు. ఒకరికి ఒకటే పదవి అని ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో తీర్మానించామని.. ఇది అందరికీ వర్తిస్తుందని తేల్చిచెప్పారు. భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ గురువారం కోచిలో మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వారికి ఒకటే సలహా ఇస్తా. ఈ పదవి కేవలం సంస్థాగతమైనదే కాదు.. నిర్దిష్ట విలువలు, విశ్వసనీయ వ్యవస్థ, భారత దార్శనికతకు ప్రతిబింబమని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. రెండు పోస్టులే కాదు.. మూడు పోస్టులైనా నిర్వహించగలనని బుధవారం చెప్పిన గహ్లోత్‌.. రాహుల్‌ వ్యాఖ్యలతో మాటమార్చారు.


ఏఐసీసీ అధ్యక్షుడు యావద్దేశంపైనా దృష్టి సారించడం అవసరమని, ఒకే పదవికి కట్టుబడి ఉండడం మేలని గురువారం పేర్కొనడం విశేషం. రాజస్థాన్‌లో తన ప్రత్యర్థి సచిన్‌ పైలట్‌కు సీఎం పదవి దక్కకుండా చూసేందుకు గహ్లోత్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారం ఢిల్లీలో సోనియాను కలిసినప్పుడు, గురువారం కోచిలో రాహుల్‌తో భేటీ అయినప్పుడు.. తాను ఢిల్లీ వచ్చేస్తే.. పైలట్‌ను మాత్రం సీఎంగా నియమించొద్దని.. తనకు సన్నిహితంగా ఉండే ఎవరినైనా ఎంపిక చేయాలని కోరగా వారు నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలిసింది. 2018 నుంచి నాలుగేళ్లుగా ఈ పదవి కోసం పైలట్‌ నిరీక్షిస్తున్నారని.. అవకాశం వచ్చినా పార్టీని చీల్చకుండా, కాంగ్రె్‌సను వదిలిపోకుండా సంయమనంగా ఉన్నారని.. ఆయ న్ను పక్కనపెట్టలేమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇంకోవైపు.. కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని రాహుల్‌కు నచ్చజెప్పేందుకు గహ్లోత్‌ కోచిలో తుది ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. తాను పోటీచేసేది లేదని ఇదివరకే స్పష్టం చేశానని.. దానికే కట్టుబడి ఉన్నానని రాహుల్‌ ఆయనకు, విలేకరులకు కూడా స్పష్టం చేశారు. మరోవైపు.. తాను నామినేషన్‌ వేయబోతున్నట్లు గహ్లోత్‌ వెల్లడించారు.


‘రాజస్థాన్‌కు నేను దూరం కాను. రాష్ట్రం కోసం పనిచేయడం కొనసాగిస్తాను. అయితే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారో వేచి చూద్దాం. అదంతా అధ్యక్ష ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు.


9 వేలకు పైగా ఓటర్లు..

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ గురువారం ఢిల్లీలో నోటిఫికేషన్‌ జారీచేశారు. శనివారం (24వ తేదీ) నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబరు 1న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు అక్టోబరు 8వ తేదీ. అదే రోజు సాయం త్రం 5 గంటలకు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబరు 17న పోలింగ్‌ జరుగుతుంది. 19న ఓట్ల లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. 9 వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 


పెరుగుతున్న ఆశావహులు..

రాహుల్‌ పోటీచేయనని తేల్చేయడం.. 22 ఏళ్లకు అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం.. 25 ఏళ్ల అనంతరం మొదటిసారి గాంధీ కుటుంబేతరులు తలపడాల్సిన పరిస్థితి తలెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పదవికి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. హేమాహేమీలు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.




ఇప్పటికే గహ్లోత్‌ పోటీ ఖాయమైంది. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ కూడా బరిలోకి దిగబోతున్నారు. సమష్టి నాయకత్వం కోరుతున్న జి-23 గ్రూపు నేతల తరఫున మాజీ మంత్రి మనీశ్‌ తివారీ పోటీచేయనున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సైతం రంగంలోకి దిగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ కూడా తాను రేసులో ఉన్నానని చెప్పారు. సోనియాను కలవడానికి గురువారం ఢిల్లీ చేరుకున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌, ముకుల్‌ వాస్నిక్‌, మల్లికార్జున్‌ ఖర్గే పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే చవాన్‌, వాస్నిక్‌ ఈ వార్తలను తోసిపుచ్చారు.

Updated Date - 2022-09-23T07:32:28+05:30 IST