రాహుల్‌ రోడ్‌ మ్యాప్‌

ABN , First Publish Date - 2022-05-07T08:22:04+05:30 IST

రైతు సంఘర్షణ సభ! ఇది తెలంగాణ కాంగ్రె్‌సకు, ఆ పార్టీ కార్యకర్తలకూ గుర్తుండిపోయే సభ. క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఉన్న అనుమానాలన్నింటినీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పటాపంచలు చేసిన సభ. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సతో కాంగ్రె్‌సకు పొత్తు

రాహుల్‌ రోడ్‌ మ్యాప్‌

టీఆర్‌ఎస్‌తో పొత్తు అనుమాలన్నీ పటాపంచలు

కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ దిశానిర్దేశం

డిక్లరేషన్‌ రూపంలో రైతులపై హామీల జల్లు 

60 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ప్రభావితం

తదుపరి ఆదివాసీలపై గురి.. త్వరలోనే సభ!

అనుమానాలన్నీ పటాపంచలు


హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): రైతు సంఘర్షణ సభ! ఇది తెలంగాణ కాంగ్రె్‌సకు, ఆ పార్టీ కార్యకర్తలకూ గుర్తుండిపోయే సభ. క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఉన్న అనుమానాలన్నింటినీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పటాపంచలు చేసిన సభ. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సతో కాంగ్రె్‌సకు పొత్తు ఉంటుందంటూ పదే పదే జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. పొత్తేకాదు.. ఆ పార్టీతో ఎటువంటి సంబంధమూ ఉండబోదని స్పష్టం చేశారు. ఇకపై కాంగ్రెస్‌ నేతలెవరైనా ఆ ప్రతిపాదన తెచ్చినా పార్టీ నుంచి బహిష్కరిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలతో అనుబంధం పెట్టుకున్నా వేటు వేస్తామన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్‌ వెంట పడతామని, ఆయనను ఓడించి తీరతామని ప్రకటించారు.


తద్వారా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ టీఆర్‌ఎ్‌సతో ఇక యుద్ధమేనని కాంగ్రెస్‌ నేతలకు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎన్నికల ముందు పైరవీలతో టికెట్లు తెచ్చుకోవాలనుకునే నేతలకూ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకే టికెట్లు ఇస్తామని, పనితీరునే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు ఇకపై క్షేత్రస్థాయి పోరాటాల్లో పాల్గొనాల్సిందేనని, ప్రజల మనసును చూరగొనాల్సిందేనన్న సందేశాన్నిచ్చారు. ఈ అంశాలపై రాహుల్‌ స్పష్టత ఇస్తున్నప్పుడు సభకు హాజరైన సాధారణ కార్యకర్తలు, ప్రజల్లోనూ ఒక అటెన్షన్‌ కనిపించడం గమనార్హం. టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఇప్పటికే పొత్తు ఉందన్న రాహుల్‌.. ఆ రెండు పార్టీల మధ్య బంధాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన ఎంఐఎం ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. 


అతి ముఖ్యమైన వర్గంపై హామీల జల్లు.. 

కులాలు, మతాలకు అతీతమైన అతిపెద్ద వర్గం ఏదైనా ఉందంటే అది రైతు వర్గమే. కౌలు రైతులతో కలుపుకొని రాష్ట్రంలో 60 లక్షలకు పైగా కుటుంబాలను ప్రభావితం చేసేలా ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఒక విధంగా రైతులపై హామీల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో పండే వరి ధాన్యాన్ని రూ.2,500కు క్వింటాలు చొప్పున కొంటామని ప్రకటించారు. ఇతర ప్రధాన పంటలను కొనుగోలు చేసే ధరలనూ ప్రకటించారు. ఇప్పటిదాకా మద్దతు ధర లేని మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. దీనికితోడు రైతులకు పెట్టుబడి సాయం ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని, దీనిని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని అన్నారు. ఇలా క్షేత్రస్థాయిలో వాస్తవ సాగుదారులే లక్ష్యంగా డిక్లరేషన్‌ను ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ ఇస్తోందని రాహుల్‌గాంధీ చెప్పడంతో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ డిక్లరేషన్‌ కాపీలను ఊరూరా రైతులందరికీ చేరవేసేందుకూ టీపీసీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. మొత్తంగా రాష్ట్రంలోని 60 లక్షలకు పైగా రైతు కుటుంబాలను ప్రభావితం చేసేలా సభ నిర్వహణ జరిగింది. 


సెంటిమెంట్‌ అస్త్రాన్నీ వాడిన రాహుల్‌..

రాహుల్‌గాంధీ ఈ సభలో తెలంగాణ సెంటిమెంటునూ టచ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది ఆషామాషీగా జరిగింది కాదన్నారు. ఈ ప్రాంత ప్రజలందరి కలను సాకారం చేయడం కోసం కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. అందుకే తెలంగాణ ప్రజల స్వప్నం.. ఇప్పుడు తమ స్వప్నం కూడా అని పేర్కొన్నారు. ఈ స్వప్నానికి ద్రోహం చేసిన కేసీఆర్‌ వెంట పడతామంటూ ఉద్వేగంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రె్‌సకు తన అవసరం ఎక్కడ ఉంటే అక్కడ అందుబాటులో ఉంటానని చెప్పారు. 


క్రమశిక్షణ విషయంలో కఠినమే..! 

టీఆర్‌ఎ్‌సతో పొత్తు ప్రస్తావన తెస్తేనే బహిష్కరణ వేటు వేస్తామని ప్రకటించడం ద్వారా పార్టీ క్రమశిక్షణ విషయంలో ఇకపై కఠినంగానే ఉంటామన్న సంకేతాలను రాహుల్‌గాంధీ ఇచ్చారు. సోనియా, రాహుల్‌గాంధీలను పొగుడుతూ సొంత పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇకపై చెల్లదన్న సంకేతాన్ని రాహుల్‌ ఇచ్చారని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై కొట్లాడిన నేతలకు.. మెరిట్‌ ఆధారంగా టికెట్లు ఇస్తామని రాహుల్‌ ప్రకటించారు. తద్వారా పార్టీలో అంతర్గత పోరు వల్ల లాభం లేదని, గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడాల్సిందేనని స్పష్టం చేసినట్లయిందంటున్నారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సక్సెస్‌ చేయగలుగుతామనే దానికి రాహుల్‌ సభే నిదర్శనమనీ చెబుతున్నారు. నడి ఎండాకాలంలో చెప్పి మరీ సభను విజయవంతం చేయడంలో నేతలందరూ కలిసికట్టుగా పని చేయడమూ ఒక కారణమంటున్నారు. 


ఎస్సీ, ఎస్టీలపైనా గురి..! 

ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకోవడంపైనా రాహుల్‌గాంధీ దృష్టి పెట్టారు. రైతు సంఘర్షణ సభ తరహాలోనే ఆదివాసీ సభ ఒకటి ఉంటుందని ప్రకటించారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రతిపాదనకూ మద్దతు ప్రకటించారు. ఇక ఈ పర్యటనలో మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం రాహుల్‌ చేస్తున్నారు. తెలుగు ప్రజల ఏకైక దళిత సీఎం అయిన దామోదరం సంజీవయ్యను ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుర్తు చేసుకుని.. శనివారం హైదరాబాద్‌లో ఆయన సమాధికి రాహుల్‌ నివాళి అర్పించనున్నారు. 


రాజగోపాల్‌రెడ్డి డుమ్మా.. చర్యలుంటాయా! 

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకూ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. శాసనసభలో మినహా పార్టీతో ఆయన ఎక్కడా సంబంధాలు కొనసాగించడంలేదు.  గాంధీభవన్‌కూ ఆయన చాలా కాలంగా రావడంలేదు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనగలిగేది బీజేపీనేనంటూ ఇటీవల కాలంలో అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేశారు. అయితే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఏఐసీసీకే ఉంది. కానీ, శాసనసభలో సభ్యుల సంఖ్య, ఇతర కారణాల దృష్ట్యా ఉపేక్షిస్తూ వస్తోంది. తాజాగా రాహుల్‌ సభకూ డుమ్మా కొట్టడంతో రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. 


రాష్ట్ర నాయకత్వం సంతృప్తి 

రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాహుల్‌గాంధీతో సభ నిర్వహించడం ఇదే తొలిసారి. తొలి సభే విజయవంతం కావడంతో టీపీసీసీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా సభకు వచ్చిన జనాన్ని ఉత్తేజితం చేసేలా రాహుల్‌గాంధీ ప్రసంగించారు. పార్టీ క్రమశిక్షణ, టీఆర్‌ఎ్‌సతో పొత్తు ఉండబోదన్న స్పష్టత ఇచ్చే విషయంలో దూకుడుగా ఆయన ప్రసంగం కొనసాగింది. 

Read more