ప్రజా ఉద్యమ లక్ష్యాలు నెరవేరుస్తారా?

ABN , First Publish Date - 2022-05-07T06:16:04+05:30 IST

రాహుల్ జీ,తెలంగాణ పర్యటనలో భాగంగా నాలాంటి ఉద్యమ కార్యకర్తలతో, హక్కుల నేతలతో మొత్తంగా ఒక ప్రజా ప్రతిపక్ష శిబిరంతోనూ ఇంటరాక్ట్ కావాలన్న మీ అభిమతం అభినందనీయం....

ప్రజా ఉద్యమ లక్ష్యాలు నెరవేరుస్తారా?

రాహుల్ జీ,తెలంగాణ పర్యటనలో భాగంగా నాలాంటి ఉద్యమ కార్యకర్తలతో, హక్కుల నేతలతో మొత్తంగా ఒక ప్రజా ప్రతిపక్ష శిబిరంతోనూ ఇంటరాక్ట్ కావాలన్న మీ అభిమతం అభినందనీయం.


సైద్ధాంతికంగా రెండు భిన్న దృక్పథాలు గల కాంగ్రెస్ ప్రభుత్వం– నక్సలైట్లు ఒక రాజకీయ సంకల్పంతో శాంతి–అభివృద్ధి అనే ఎజెండాతో ఒకే టేబుల్‌పై వారం రోజుల పాటు చర్చించిన చరిత్ర తెలుగు నేల సొంతం. అంతిమంగా ఇవి శాంతిభద్రతల అంశంగా కుదించబడి రక్తపుటేరులతో అశాంతి రాజ్యమేలిన వైనం విస్మరించలేనిది. కానీ ఇందులోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఒక ఎజెండా అంశం ఆ తర్వాత మహోద్యమంగా ప్రజ్వరిల్లిన ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిందనేది కూడా అంతే సత్యం.

ప్రతాపరుద్రుని ఆత్మార్పణ, సమ్మక్క సారలమ్మ తిరుగుబాటుల నుంచి ఆత్మగౌరవం–పోరాటతత్వం గల స్వయంపోషక ఆర్థిక విధానాలతో తెలంగాణ జీవన విధానం రూపొందింది. వీటి విధ్వంసం నుంచే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నేపథ్యంలో, వాటిని పునరుద్ధరింపజేయడమే నిజమైన ప్రజా ఎజెండా కావాలని నా అభిప్రాయం. అలాంటి ప్రజా ప్రత్యామ్నాయాన్ని తెలంగాణ ఉద్యమంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ నాలాంటి వాళ్లు ఎంతోమంది కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ లక్ష్యంతోనే కింది అంశాలను మీముందు ప్రస్తావిస్తున్నాను.


నవధాన్య సంస్కృతిని తెలంగాణ ఆహార సంస్కృతిగా కొనసాగించడం, దానికోసం భూమిలేని వారికి భూమి అందించడం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలతో పాటు ఉద్యోగాల కల్పనలో ఉత్పత్తి రంగాలైన వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చాలి. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలి. సామాజిక న్యాయాన్ని ఆర్థిక – రాజకీయ రంగాలన్నింటిలో పాటించాలి. కులోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయాలి. ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలి. మతం కంటే మానవ సేవే గొప్పదని చాటుదాం.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన ఆర్థిక ప్రజాస్వామ్యం – రాజకీయ ప్రజాస్వామ్యం అనే మహత్తర పిలుపు అర్థం వనరుల వికేంద్రీకరణ – అధికారాల వికేంద్రీకరణగా మలిచినప్పుడే, నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో తెలంగాణ పరిఢవిల్లగలదని విశ్వసిస్తున్నాను. ఈ ప్రజా ఉద్యమ లక్ష్యాలు నెరవేరడంలో ప్రజా ప్రతిపక్ష శిబిరంలోని ఒక కార్యకర్తగా నా కృషి ఎల్లవేళలా కొనసాగుతుందని తెలుపుతూ, ముందస్తు పనుల వల్ల మీ ఇంటరాక్షన్‌కు హాజరుకాలేకపోతున్నందున ఈ విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. 

– విమలక్క

తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌

Read more