Abn logo
Jul 27 2021 @ 01:31AM

ట్రాక్టర్‌పై పార్లమెంటుకొచ్చిన రాహుల్‌!

  • కొత్త సాగు చట్టాల రద్దుకు డిమాండ్‌


న్యూఢిల్లీ, జూలై 26: కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మద్దతు పలికారు. సోమవారం ఆయన పార్టీ ఎంపీలతో కలిసి ట్రాక్టర్‌ నడుపుకుంటూ పార్లమెంటుకు వచ్చారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


‘‘మేం రైతుల సందేశాన్ని పార్లమెంటుకు తీసుకొచ్చాం. వారి సమస్యలను పార్లమెంటు చర్చించడం లేదు. దేశంలోని రైతులందరూ అణచివేతకు గురవుతున్నారు. అందుకే మేం పార్లమెంటుకు ఇలా వచ్చాం. ఈ నల్లచట్టాలను ఉపసంహరించుకోవాల్సిందే’’ అని రాహుల్‌ విలేకరులతో అన్నారు. ఇక జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహిస్తున్న ‘రైతుల పార్లమెంటు (కిసాన్‌ సంసద్‌)’ను సోమవారం మహిళా రైతుల ఆధ్వర్యంలో నడిపారు. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన 200 మంది మహిళలు కిసాన్‌ సంసద్‌ను నిర్వహించారు. 


కాగా,  లడాఖ్‌లోని భారత భూభాగంలో చైనా సైనికులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆ దేశంతో కమాండర్ల స్థాయి చర్చలు ఎప్పుడు జరుపుతారని ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.