ముంబై : మహారాష్ట్ర శాసన సభ సభాపతి (Speaker)గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) ఆదివారం ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 164 ఓట్లు, ఆయన ప్రత్యర్థి రాజన్ సాల్వి (Rajan Salvi)కి 107 ఓట్లు వచ్చాయి. ఏఐఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఇతరులు రాహుల్ నార్వేకర్‌కు మద్దతుగా ఓటు వేశారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు రాజన్ సాల్వికి ఓటు వేశారు.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వ బల పరీక్ష కోసం ఆది, సోమవారాల్లో శాసన సభ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఆదివారం సభాపతి ఎన్నిక జరిగింది.
సభాపతి ఎన్నిక సమయంలో శివసేనకు చెందిన ఎమ్మెల్యే యామిని యశ్వంత్ జాదవ్‌ను లెక్కించేటపుడు ప్రతిపక్షాలు ఈడీ, ఈడీ అంటూ నినాదాలు చేశాయి. ఆమె భర్త యశ్వంత్ జాదవ్‌పై ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుగుతోంది. ఆయన బృహన్ముంబై నగర పాలక సంస్థ మాజీ చైర్మన్. ఆయన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపించింది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు బాలా సాహెబ్ థాకరేకి నివాళులర్పించారు. కొలాబాలోని రీగల్ సినిమా వద్ద థాకరే విగ్రహం వద్ద షిండే, ఆయనకు మద్దతిస్తున్న శివసేన ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.
రాహుల్ నార్వేకర్ (45) తొలిసారి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. గతంలో ఆయన శివసేన, ఎన్‌సీపీ పార్టీల్లో ఉండేవారు. 2019లో బీజేపీలో చేరారు.
ఇవి కూడా చదవండి