రాహుల్ హత్యకు.. ఆ మహిళే కారణమా..?

ABN , First Publish Date - 2021-08-24T15:42:44+05:30 IST

విజయవాడ: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో రోజురోజుకూ పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ-2 నిందితుడైన కోగంటి సత్యంను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్ హత్యకు.. ఆ మహిళే కారణమా..?

హత్య కేసులో ఏ-2 నిందితుడి అరెస్ట్ 

రాహుల్‌కు రూ.6కోట్లు ఇచ్చిన గాయత్రి అనే మహిళ

డబ్బుల విషయంలో మొదలైన గొడవ

కూపీ లాగుతున్న పోలీసులు


విజయవాడ: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో రోజురోజుకూ పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ-2 నిందితుడైన కోగంటి సత్యంను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని బెంగళూరు దేవనహల్లి కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొస్తున్నారు. గాయత్రి అనే మహిళ రాహుల్‌కు రూ.6కోట్లు ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వివాదమే రాహుల్‌ను హత్య చేసే వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ మహిళ ఎవరు, అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఇచ్చింది, రాహుల్ హత్యలో మహిళ కూడా ఉండడానికి కారణం ఏంటి.. అనే దానిపై పోలీసులు కూపీ లాగారు. 


మృతుడు రాహుల్ ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి. ఏ-1 నిందితుడు విజయ్‌కుమార్ కూడా అక్కే చదివాడు. ఆ క్రమంలో రాహుల్‌తో పరిచయం ఏర్పడి.. వారి కుటుంబానికి దగ్గరయ్యాడు. తర్వాత రాహుల్ కంపెనీలో భాగస్వామి అయ్యాడు. ఏడాది తర్వాత మరో ఇద్దరు భాగస్వాములుగా వచ్చారు. దీంతో ఆర్థిక వ్యవహారాల్లో వివాదాలు మొదలయ్యాయి. రాహుల్ పుంగనూరులో మరో పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో వివాదం మరింత రాజుకుంది. కోరాడ ఫైనాన్స్ కంపెనీలో భాగస్వామి అయిన గాయత్రి కుమార్తె పద్మజకు.. ఎయిమ్స్‌లో పీజీ సీటు ఇప్పించడానికి రాహుల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకు రాహుల్‌కు గాయత్రి రూ.6కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఈ డబ్బు విషయంలోనే ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. 


ఈ నెల 18న రాత్రి 7గంటల సమయంలో రాహుల్.. కారులో డీవీమానర్ రోడ్డులో పుడ్ ప్లాజా ఎదురుగా ఉన్న రైల్ మిల్ వద్దకు వచ్చారు. దీంతో కోరాడ, సీతయ్య అనే వాచ్‌మన్, మరో యువకుడు కలిసి రాహుల్ కారులోకి వెళ్లారు. గాయత్రికి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అడగ్గా.. రాహుల్ ఎదురు తిరిగినట్లు సమాచారం. కాసేపటికి కోరాడ.. కారు దిగి వెళ్లిపోయారు. కారులో ఉన్న మిగిలిన ఇద్దరు కలిసి రాహుల్‌ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరైన సీతయ్య.. గతంలో రాహుల్ కంపెనీలో వాచ్‌మన్‌గా పనిచేసినట్లు సమాచారం. అయితే ఈ వాచ్‌మన్ విజయ్‌కుమార్ బంధువని.. కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని కోరాడకు చేరవేస్తున్నాడనే కారణంతో విధుల నుంచి తొలగించాడు. ఇలా రాహుల్ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. కోరాడ, కోగంటి సత్యంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా నిందితులను రహస్యంగా విచారిస్తున్నారు.

Updated Date - 2021-08-24T15:42:44+05:30 IST