Abn logo
Jan 25 2021 @ 06:47AM

మీలో ఒకడిని మీ కష్టనష్టాలు తెలిసిన వాడిని

బలం చేకూరిస్తే మీ గొంతుకనవుతా ..

తిరుప్పూరు ప్రచారంలో రాహుల్‌

చెన్నై(ఆంధ్రజ్యోతి): ‘మీ కుటుంబంలో ఒకడిని.. మీ కష్టనష్టాలు తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చా. మాకు బలం చేకూరిస్తే మీ గొంతుకనవుతా. ‘మన్‌కీ బాత్‌’ పేరుతో కథలు చెప్పడానికి రాలేదు. మీరు చెప్పేది వినడానికి, మీ కష్టనష్టాలు తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చా’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ తిరుప్పూరులో ప్రజలకు పిలుపునిచ్చారు. కొంగుమండలంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన రాహుల్‌గాంధీ రెండవరోజైన ఆదివారం తిరుప్పూరు జిల్లా ఊత్తుకుడిలో ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రచారం చేశారు. శనివారం రాత్రి తిరుప్పూరు ప్రభుత్వ బంగ్లాలో బస చేసిన రాహుల్‌.. ఓపెన్‌జీపులోనే ఊత్తుకుడి వరకు వెళ్లారు. అనంతరం ఈరోడ్డు జిల్లా పెరుందురైవెళ్లారు. రెండు చోట్లా ప్రసంగించారు. ‘వణక్కం’ అంటూ తమిళంలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీలకు తమిళ ప్రజలు ఇచ్చిన గౌరవమర్యాదలు తెలుసన్నారు. ‘నేను మీలో ఒకడిని. మీ కుటుంబంలో పుట్టిన బిడ్డనని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను’ అంటూ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళ సంస్కృతీ సంప్రదా యాలను, భాషను, తమిళులను కించపరుస్తున్నారన్నది బహిరంగమేనని పునరుద్ఘాటించారు. తమిళ పదాలు ఉచ్ఛరిస్తూ తమిళుల్ని మోసం చేయాలనుకుంటున్నారని, కానీ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయలేరన్నదే వాస్తవ మన్నారు. తాను ‘మన్‌ కీ బాత్‌’ పేరుతో కథలు చెప్పి సందేశాలు ఇవ్వడానికి రాలేదని, తమిళ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకునేందుకు, వాటిని పరిష్కరిం చేందుకే వచ్చానన్నారు.


ఇందుకు తాను అంకితభావంతో పని చేస్తానని హామీఇచ్చారు. ‘మన తమిళ గొప్పదనం దేశంలోని మిగతా రాష్ట్రాలు తెలుసుకోవాల్సివుంది. నేను తమిళుడిని కాకపోయినా తమిళాన్ని గౌరవిస్తాను. తమిళాన్ని మోదీ అవమానించడాన్ని సహించలేను. మోదీ తమిళులకు ద్రోహం తలపెడుతున్నారు. నేను మీ ఇంటిబిడ్డనన్న విషయాన్ని తెలుసుకోండి’ అని ప్రజల హర్షధ్వానాల మధ్య భావోద్వేగంతో ప్రకటించారు. తిరుప్పూరు లో చేనేత కార్మికులు ఎంత కష్టపడి దుస్తులు నేస్తున్నారో తనకు తెలుసని, వారి శ్రమకు తగినట్టు మరింత న్యాయం జరగాల్సి వుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలు, తమిళనాడు ప్రభుత్వ సిద్ధాంతాలు ఒక్కటేనని, ఆ రెండూ ప్రజా వ్యతిరేకమైనవని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు  కరోనావిపత్కాలంలో కేంద్ర వైఫల్యం వల్ల తమిళనాడు ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారన్నారు. పరిశ్రమల రాష్ట్రంగా దేశంలోనే తమిళనాడు పేరుగాంచిందని, కానీ మోదీ విధానం ఈ పరిశ్రమలన్నింటినీ ధ్వంసం చేసేలా తయారైందన్నారు. 

అందరిలో కలిసిపోయి..

నీలం టీషర్టు, ఖాకీ ప్యాంటు వేసుకుని ప్రచారం ప్రారంభించిన రాహుల్‌గాంధీ ఆద్యంతం ప్రజల్లో కలిసిపోయి, అందరినీ పలుకరిస్తూ కలియతిరిగారు. తిరుప్పూర్‌ జిల్లా ఊత్తుకుడిలో ఆయనకు స్వాగతం చెప్పేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజలు జేజేలు పలుకుతుండగా గమనించిన రాహుల్‌.. తన కాన్వాయ్‌ని ఆపించారు. భద్రతా వలయాన్ని దాటుకుని రోడ్డుకిందకు దిగారు. ప్రజలకు కరచాలనం చేశారు. ఊహించని పరిణామానికి ఉబ్బితబ్బిబ్బయిన ప్రజలు తమ వెంట తెచ్చుకున్న తువ్వాలు, లేదా శాలువాలను ఆయనకు బహూ కరించారు. వాటిని తన శరీరంపై కప్పుకున్న రాహుల్‌.. వృద్ధుల వద్ద ఆశీర్వాదం తీసుకుంటూ, వారిని ఆప్యాయంగా కౌగలించుకుంటూ, చిన్నారులతో ముచ్చటిస్తూ, వారిని ఆశీర్వదిస్తూ చాలాదూరం నడుచుకుంటూ వెళ్లారు. దాంతో భద్రతాబలగాలు కొద్దిసేపు టెన్షన్‌ పడ్డాయి. జనం ఆయనపై పడకుండా అడ్డుగోడగా నిలిచేందుకు ప్రయత్నించాయి. అయినా రాహుల్‌ వారిని వారించి ప్రజలతో కరచాలనం చేస్తూ ముందుకు సాగిపోయారు. రాహుల్‌ ప్రసంగాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ తమిళంలోకి అనువదించారు. 

Advertisement
Advertisement
Advertisement