ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలి : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-11-03T18:25:09+05:30 IST

దీపావళి పండుగ సమయంలో పెరుగుతున్న ధరలు

ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : దీపావళి పండుగ సమయంలో పెరుగుతున్న ధరలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి స్పందించే హృదయం అవసరమని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీపావళి సమయంలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరిందన్నారు. 


‘‘దీపావళి వచ్చింది. ద్రవ్యోల్బణం తారస్థాయిలో ఉంది. ఇది జోక్ కాదు. ప్రజల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు. 


పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ, కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి డబ్బు గుంజుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో, జేబు దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. 


Updated Date - 2021-11-03T18:25:09+05:30 IST