న్యూఢిల్లీ : షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ సన్నాహాలు ప్రారంభించినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీలురైన లింగాయత్‌లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తుమకూరులోని సిద్ధగంగ మఠాధిపతి శ్రీ శివకుమార స్వామీజీ 115వ జయంత్యుత్సవాలకు ఈ పార్టీల అగ్ర నేతలు హాజరు కాబోతున్నారు.
శ్రీ శివకుమార స్వామీజీ జయంత్యుత్సవాలకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా శుక్రవారం హాజరవుతారు. అమిత్ షా పర్యటన వివరాలు వెల్లడైన తర్వాత కర్ణాటక కాంగ్రెస్ నేతల సలహా మేరకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఈ మఠానికి ఒక రోజు ముందుగానే రాబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరు చేరుకుని, ఈ మఠానికి వెళ్తారు. స్వామీజీ సమాధిని సందర్శిస్తారు. మఠంలోనే భోజనం చేస్తారని తెలుస్తోంది.
కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ, ఈ మఠానికి, గాంధీ కుటుంబానికి మధ్య ఉన్నసంబంధాన్ని భగవంతునికి, భక్తునికి మధ్య ఉండే సంబంధంతో పోల్చారు. ఇందిరా గాంధీ శృంగేరీ శారదా మఠాన్ని సందర్శించేవారని, సలహాలు తీసుకునేవారని చెప్పారు. రాజీవ్ గాంధీ కూడా అక్కడ వారోత్సవాల్లో పాల్గొనేవారని తెలిపారు.
స్వామీజీ జయంత్యుత్సవాల్లో దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటుండటంతో తాము కూడా మఠానికి వ్యతిరేకం కాదనే సంకేతాలను పంపించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇటీవల సిద్ధరామయ్య మాట్లాడుతూ, ముస్లిం మహిళలు ధరించే హిజాబ్, స్వామీజీలు ధరించే సంప్రదాయ వస్త్రాల మధ్య పోలిక తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది.
శ్రీ శివకుమార స్వామీజీకి ‘భారత రత్న’ పురస్కారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఆయన కుమారుడు బీవై విజయేంద్ర చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ మఠం ప్రస్తుత అధిపతి శ్రీ సిద్ధ లింగ స్వామీజీ మాత్రం తాము ఈ విషయంలో పట్టుబట్టబోమని చెప్పారు. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఈ పురస్కారాన్ని స్వామీజీకి ఇస్తే అది అమృతం వంటిదవుతుందని, ఒత్తిళ్ళ ద్వారా వస్తే అది విషం వంటిదవుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి