అమర జవాన్ జ్యోతికి శంకుస్థాపన చేయనున్న రాహుల్

ABN , First Publish Date - 2022-01-30T14:39:22+05:30 IST

1972లో అమరవీరుల గౌరవార్ధంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. వీక్షకులకు ఈ అమర జ్యోతి నిత్యం వెలుగుతూ కనిపించేది. కానీ దానిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేశారు. ఇది కాస్త అసంతృప్తిని ఇచ్చింది..

అమర జవాన్ జ్యోతికి శంకుస్థాపన చేయనున్న రాహుల్

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో నిర్మించ తలపెట్టిన అమర జవాన్ జ్యోతికి ఫిబ్రవరి రాహుల్ గాంధీ భూమి పూజ చేయనున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రకటించారు. ఇందిరా గాంధీ హయాంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన అమర జవాన్ జ్యోతిని ఈ మధ్యే జాతీయ యుద్ధ స్మారకంలో మోదీ ప్రభుత్వం విలీనం చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ నేతృత్వంలోని బాఘేల్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ సైనిక బలగాల 4వ బెటాలియన్ పరిసర ప్రాంతంలో అమర జవాన్ జ్యోతిని నిర్మించనున్నట్లు బాఘేల్ తెలిపారు. ఈ విషయమై బాఘేల్ మాట్లాడుతూ ‘‘అమర సైనికులకు నివాళిగా నిర్మించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రాహుల్ గాంధీ గురువారం భూమి పూజ చేస్తారు. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. త్యాగాల విలువ పార్టీకి బాగా తెలుసు. అమర సైనికుల త్యాగాలను, కృషిని విస్మరిస్తే ఈ సమాజం విధ్వంసం అవుతుంది’’ అని అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘1972లో అమరవీరుల గౌరవార్ధంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. వీక్షకులకు ఈ అమర జ్యోతి నిత్యం వెలుగుతూ కనిపించేది. కానీ దానిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేశారు. ఇది కాస్త అసంతృప్తిని ఇచ్చింది. అందుకే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఛత్తీస్‌గఢ్‌లోని అమరవీరుల జ్ణాపకార్థం రాయ్‌పూర్‌లో అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని అన్నారు.

Updated Date - 2022-01-30T14:39:22+05:30 IST