మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2022-02-11T23:09:37+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాస్తవ సమస్యల నుంచి గోవా ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారని

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాస్తవ సమస్యల నుంచి గోవా ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పర్యావరణం, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు అనేకం ఉండగా, గోవాకు స్వాతంత్ర్యం రావడం గురించి మాట్లాడుతున్నారన్నారు. అప్పటి పరిస్థితులను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. 


మోదీ గురువారం మపుసలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడే గోవాకు స్వాతంత్ర్యం సిద్ధించి ఉండేదన్నారు. జవహర్లాల్ నెహ్రూ కోరుకుంటే కొద్ది గంటల్లోనే గోవాకు పోర్చుగీసు పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చి ఉండేదన్నారు. గోవాకు స్వాతంత్ర్యం తేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 15 ఏళ్ళు పట్టిందని చెప్పారు. 


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మార్గావ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అప్పటి చరిత్ర అర్థం కాదన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన విషయాలు ఆయనకు అర్థం కావన్నారు. పర్యావరణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే ఆయన గోవా వస్తున్నారని ఆరోపించారు. 


ఇదిలావుండగా, ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన హిజాబ్ ధారణ గురించి మాట్లాడటానికి రాహుల్ నిరాకరించారు. గోవా ప్రజలకు ముఖ్యమైనవాటిపైనే తాను దృష్టి పెడతానని చెప్పారు.


Updated Date - 2022-02-11T23:09:37+05:30 IST