EPF interest rate cut : మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-04T18:30:32+05:30 IST

చిరునామాలో ప్రజా సంక్షేమాన్ని పెట్టుకున్నంత మాత్రానికి సరిపోదని

EPF interest rate cut : మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ : చిరునామాలో ప్రజా సంక్షేమాన్ని పెట్టుకున్నంత మాత్రానికి సరిపోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో శనివారం గాంధీ ఓ ట్వీట్ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. 


నివసించే ఇంటి చిరునామాలో ‘‘లోక్ కల్యాణ్ మార్గ్’’ (ప్రజా సంక్షేమ రహదారి) (Lok Kalyan Marg) అని పెట్టుకున్నంత మాత్రానికి ప్రజలకు సంక్షేమం జరగదని హితవు పలికారు.  

‘‘ఇంటి చిరునామాను ‘లోక్ కల్యాణ్ మార్గ్’ అని పెట్టుకోవడం ప్రజలకు సంక్షేమాన్ని తీసుకురాదు. 6.5 కోట్ల మంది ఉద్యోగుల వర్తమానం, భవిష్యత్తును నాశనం చేయడానికి ‘ద్రవ్యోల్బణం పెంపు, ఆదాయం తగ్గింపు’ విధానాన్ని ప్రధాన మంత్రి అమలు చేస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi)  ట్వీట్ చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటు సవరణకు సంబంధించిన వార్తా కథనాన్ని దీనికి జత చేశారు. 


రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ (Congress) అధికార ప్రతినిధి పవన్ ఖేరా (Pawan Khera) స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, తన తప్పులను గుర్తించిన మోదీ, లోక్ కల్యాణ్ మార్గ్ పేరును జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఆయన మోదీ మహల్‌ను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మితమవుతున్న పార్లమెంటు, తదితర పరిపాలనా భవనాలతో కూడిన సెంట్రల్ విస్టా అవెన్యూను పరోక్షంగా మోదీ మహల్ అని పేర్కొన్నారు. రాహుల్ ఇచ్చిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 


ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మార్చిలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. ఇంత తక్కువ వడ్డీ రేటు ఉండటం 40 ఏళ్ళలో ఇదే మొదటిసారి. 1977-78లో ఈ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్డును 2016లో లోక్ కల్యాణ్ మార్గ్‌గా మార్చారు. 


Updated Date - 2022-06-04T18:30:32+05:30 IST