కేంద్ర మంత్రి మాటలతో అసలు నిజం బయటపడింది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-03-10T00:55:39+05:30 IST

పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు హద్దుల్లేకుండా పెరిగిపోతుండటంపై కాంగ్రెస్

కేంద్ర మంత్రి మాటలతో అసలు నిజం బయటపడింది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు హద్దుల్లేకుండా పెరిగిపోతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా, తన ‘మిత్రుల’కు అతిగా సహాయపడుతుండటంపై నిలదీశారు. పెట్రో ఉత్పత్తుల నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్న విషయం స్పష్టంగా బయటపడిందన్నారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్లపై విచక్షణ లేకుండా పన్నులు విధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తన మిత్రుల రుణాలను, పన్నులను రద్దు చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించిన వివరాల వల్ల అసలు నిజం స్పష్టంగా బయటపడిందని పేర్కొన్నారు. 


రాహుల్ గాంధీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, సామాన్యుల నుంచి విచక్షణ లేకుండా ఎల్‌పీజీ, పెట్రోలు, డీజిల్‌లపై పన్నులను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తన ‘మిత్రుల’ పన్నులు, రుణాలను రద్దు చేస్తోందని, ఆ నిజం ఇప్పుడు స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటు ఓ వార్తా కథనాన్ని జత చేశారు. 


పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ వివరించిన అంశాలతో కూడిన వార్తా కథనాన్ని రాహుల్ గాంధీ ఈ ట్వీట్‌తో జత చేశారు. గడచిన ఏడేళ్ళలో ఎల్‌పీజీ సిలిండర్ల ధర రెట్టింపు అయిందని, ఇదే సమయంలో పెట్రోలు, డీజిల్‌లపై పన్ను వసూళ్ళు 459 శాతం పెరిగాయని ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది. 


Updated Date - 2021-03-10T00:55:39+05:30 IST