దేశం ఎదుర్కొంటున్న కష్టాలకు బాధ్యులు హిందుత్వవాదులే : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-12-18T22:49:36+05:30 IST

దేశంలో ద్రవ్యోల్బణం, బాధలు, విచారం పెరగడానికి కారణం

దేశం ఎదుర్కొంటున్న కష్టాలకు బాధ్యులు హిందుత్వవాదులే : రాహుల్ గాంధీ

అమేథీ : దేశంలో ద్రవ్యోల్బణం, బాధలు, విచారం పెరగడానికి కారణం హిందుత్వవాదులేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, నేడు యుద్ధం హిందువులు, హిందుత్వవాదుల మధ్య జరుగుతోందన్నారు. హిందువులు సత్యాగ్రహాన్ని విశ్వసిస్తే, హిందుత్వవాదులు సత్తాగ్రహ్ (రాజకీయ దురాశ)ను నమ్ముతారని అన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, పరాజయాన్ని చవి చూసిన తర్వాత ఆయన ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. 


రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం అమేథీలో 6 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంగా నదిలో స్నానం చేస్తారని, నిరుద్యోగం వంటి అంశాలపై మౌనంగా ఉంటారని అన్నారు. దేశంలో ప్రజలకు ఉపాధి ఎందుకు లభించడం లేదని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం ఎందుకు అంత వేగంగా వృద్ధి చెందుతోందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని ముఖ్యమైన సమస్యల నుంచి వేరొక అంశాలపైకి మళ్ళించడంలో తీరిక లేకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం, బాధలు, విచారం పెరగడానికి కారణం హిందుత్వవాదులేనని చెప్పారు. నేడు యుద్ధం హిందువులు, హిందుత్వవాదుల మధ్య జరుగుతోందన్నారు. హిందువులు సత్యాగ్రహాన్ని విశ్వసిస్తే, హిందుత్వవాదులు సత్తాగ్రహ్‌ను నమ్ముతారని అన్నారు.


లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా తన సొంతం చేసుకుందని, అయినప్పటికీ ప్రధాని మోదీ ఏమీ మాట్లాడటం లేదని చెప్పారు. మన భూమిని చైనా తీసుకోలేదని మోదీ చెప్తున్నారని, తీసుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తోందని అన్నారు. 


Updated Date - 2021-12-18T22:49:36+05:30 IST