మరణించిన రైతుల జాబితా నేను ఇస్తా : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-12-03T23:58:43+05:30 IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ప్రాణాలు

మరణించిన రైతుల జాబితా నేను ఇస్తా : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలను తాను సమర్పిస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరినపుడు, తమ వద్ద ఆ వివరాలు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అబద్ధాలు చెప్తోందన్నారు. 


సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారా? అని పార్లమెంటులో ప్రశ్నించినపుడు దానికి సంబంధించిన రికార్డు తన వద్ద లేదని, అందువల్ల ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని ప్రభుత్వం చెప్పిందన్నారు. మరణించిన రైతులకు నష్టపరిహారం చెల్లించే హుందాతనం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎందుకు లేదని ప్రశ్నించారు. తను తప్పు చేశానని ప్రధాని మోదీయే స్వయంగా అంగీకరించారని, క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆ తప్పు చేయడం వల్ల 700 మంది రైతులు మరణించారన్నారు. ఇప్పుడు వారి పేర్ల విషయంలో అబద్ధాలు చెప్తున్నారన్నారు. వారికి ఇవ్వవలసినదానిని ఇచ్చే హుందాతనం మీకు (మోదీకి) ఎందుకు లేదని ప్రశ్నించారు. తన వద్ద సమాచారం లేదని ప్రభుత్వం ఎలా చెబుతుందన్నారు. పంజాబ్ ప్రభుత్వం, ఇతరుల వద్ద ఆ పేర్లు ఉన్నాయని, అలాంటపుడు అబద్ధాలు ఎందుకని ప్రశ్నించారు. సాగు చట్టాలను రద్దు చేయడం మినహా రైతుల ఇతర డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే అవకాశం కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్దేశం సరికాదన్నారు. 


వివాదాస్పద సాగు చట్టాలను పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున (నవంబరు 29న) రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-12-03T23:58:43+05:30 IST