Abn logo
Mar 30 2021 @ 19:49PM

అస్సాం సంస్కృతిపై దాడిని అనుమతించబోం : రాహుల్ గాంధీ

గౌహతి : అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అనుమతించబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సీఏఏను  అస్సాం సంస్కృతి, చరిత్ర, భాషలపై దాడిగా అభివర్ణించారు. ఈ చట్టాన్ని అస్సాంలో అమలుకానివ్వబోమని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడంతో రాహుల్ గాంధీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 


కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఐదు హామీలను అమలు చేస్తామని చెప్పారు. సీఏఏను అమలుకానివ్వబోమని చెప్పారు. ఈ చట్టాన్ని అస్సాం భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలపై దాడిగా అభివర్ణించారు. ఐదేళ్ళలో ఐదు లక్షల ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని, తేయాకు తోటల్లో పని చేసేవారి దినసరి కనీస వేతనాన్ని రూ.365కు పెంచుతామని తెలిపారు. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. ప్రతి గృహిణికి నెలకు రూ.2,000 అందజేస్తామని తెలిపారు. 


మూడు దేశాల మైనారిటీల కోసం

బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబరు 31నాటికి భారత దేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారశీకులు, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ అనుమతిస్తుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో 2019లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. తమ జీవనోపాధికి, సాంస్కృతిక ప్రత్యేకతకు ఈ చట్టం వల్ల ముప్పువాటిల్లుతుందని అస్సాంలో ఆందోళన వ్యక్తమవుతోంది. 


అస్సాం శాసన సభ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి దశ ఎన్నికలు మార్చి 27న జరిగాయి. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.