పంజాబ్‌ ఓటర్లకు రాహుల్ గాంధీ భారీ హామీ

ABN , First Publish Date - 2022-02-14T21:13:39+05:30 IST

వ్యవసాయోత్పత్తుల ప్రతిఫలాన్ని నేరుగా రైతులకు చెల్లించేందుకు

పంజాబ్‌ ఓటర్లకు రాహుల్ గాంధీ భారీ హామీ

హోషియార్‌పూర్ (పంజాబ్) : వ్యవసాయోత్పత్తుల ప్రతిఫలాన్ని నేరుగా రైతులకు చెల్లించేందుకు వీలుగా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తిరిగి తమ పార్టీ గెలిస్తే, హోషియార్‌పూర్‌లో ఫుడ్ పార్కులు, మెషిన్ టూల్స్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 


వ్యవసాయం, వ్యవసాయ ఉపకరణాలకు కేంద్రం హోషియార్‌పూర్ అని చెప్పారు. ఇక్కడ ఫుడ్ పార్కులు, మెషిన్ టూల్స్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పొటాటో చిప్స్, టమాటా కెచప్ వంటివాటిని ఇక్కడే తయారు చేయవచ్చునని తెలిపారు. రైతులు తమ పొలాల్లో పండించి, నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు తీసుకెళ్ళవచ్చునని చెప్పారు. దీనివల్ల తమ వ్యవసాయోత్పత్తుల ప్రతిఫలం రైతులకు నేరుగా అందుతుందని చెప్పారు. 


రైతుల శ్రమను ఇద్దరు, ముగ్గురు బిలియనీర్లకు ఇచ్చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నించారని, రైతులను ఓ సంవత్సరంపాటు చలిలో ఆకలితో ఉంచారని ఆరోపించారు. కొత్త సాగు చట్టాలపై నిరసన తెలియజేస్తూ ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించేందుకు పార్లమెంటులో రెండు నిమాషాలపాటు మౌనం పాటించలేకపోయారని దుయ్యబట్టారు. మరణించిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. పంజాబ్, రాజస్థాన్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం చెల్లించాయని చెప్పారు. 


కొత్త సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-02-14T21:13:39+05:30 IST