బామ్మ మాటను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-11-01T00:18:37+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి, తన బామ్మ ఇందిరా

బామ్మ మాటను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి, తన బామ్మ ఇందిరా గాంధీ హత్యకు కొద్ది సేపటి ముందు తనతో మాట్లాడారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆమెకు ఏదైనా జరిగితే ఏడవొద్దని తనకు చెప్పారని తెలిపారు. ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె హత్య, అంత్యక్రియల సంఘటనలను ఆదివారం ఆయన గుర్తు చేసుకున్నారు. 


ఇందిరా గాంధీ 37వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. ఆమె అంత్యక్రియలు జరిగిన రోజు తన జీవితంలో రెండో అత్యంత కష్ట దినమని చెప్పారు. 1984 అక్టోబరు 31 ఉదయం తనతో ఆమె మాట్లాడారని తెలిపారు. ఆమెకు ఏదైనా జరిగితే ఏడవొద్దని తనకు చెప్పారన్నారు. అప్పుడు ఆమె చెప్తున్నదేమిటో తనకు అర్థం కాలేదన్నారు. రెండు, మూడు గంటల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రాహుల్ గాంధీ యూట్యూబ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆమెను హత్య చేస్తారని ఆమె ముందుగానే పసిగట్టినట్లు ఉందని, ఇంట్లో అందరికీ ఈ విషయం తెలుసునని తాను అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఓసారి డైనింగ్ టేబుల్ వద్ద ఆమె మాట్లాడుతూ, వ్యాధితో బాధపడుతూ మరణించడం అతి పెద్ద శాపమని చెప్పారన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించడం అత్యుత్తమమని ఆమె దృక్పథం కావచ్చునన్నారు. 


ఇందిరా గాంధీ అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. 1984 అక్టోబరు 31న ఇందిరా గాంధీ సెక్యూరిటీ గార్డులు ఆమెను హత్య చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-11-01T00:18:37+05:30 IST