కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు రాహుల్ రియాక్షన్ ఇదే...

ABN , First Publish Date - 2022-03-15T23:28:32+05:30 IST

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు..

కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు రాహుల్ రియాక్షన్ ఇదే...

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. జీ-23 అసమ్మతి నేతల్లో ఒకరైన సిబాల్‌పై లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, పార్టీ లోక్‌సభ విప్ మాణిక్యం ఠాగూర్ సహా పలువురు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మంగళవారం ఉదయం పార్లమెంటు వద్ద విలేఖరుల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. పార్లమెంటు హాలు వద్ద కారులో నుంచి రాహుల్ దిగగానే కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై మీడియా సిబ్బంది ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ గుంభనగా వ్యవహరిస్తూ పార్లమెంటులోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు.


కపిల్ సిబాల్‌పై నేతల ఫైర్...

కపిల్ సిబాల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీలు (సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొ్న్నారు. 'సబ్ కీ కాంగ్రెస్'ను తాను కోరుకుంటున్నానని, కొందరు 'ఘర్ కీ కాంగ్రెస్'ను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ భాషలో కపిల్ సిబాల్ మాట్లాడుతున్నారని ఆ పార్టీ లోక్‌సభ విప్ మాణిక్యం ఠాగూర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీల నాయకత్వం లేకుండా చేసి, ఆ పార్టీని ఒకప్పటి జనతా పార్టీ స్థాయికి మార్చి, ఆ తర్వాత భూస్థాపితం చేయాలని బీజేపీ కోరుకుంటోందని, అదే భాషలో సిబాల్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనికి ముందు, లోక్‌సభ కాంగ్రెస్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సైతం సిబాల్‌పై ఘాటు విమర్శలు చేశారు. సిబాల్ కృతజ్ఞతలేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.


పదవుల త్యాగానికి సిద్ధమే..

కాగా, తనతో పాటు తన కుటుంబ సభ్యులు (రాహుల్, ప్రియాంక) పదవులు త్యాగం చేసేందుకు సిద్ధమైనంటూ గత ఆదివారం ఉదయం సోనియాగాంధీ ఒక ప్రతిపాదన చేశారు. అయితే, ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తోసిపుచ్చింది. కాంగ్రెస్ పార్టీ సైతం తమ మాజీ నేతలైన మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఫోటోలతో కూడిన ఒక వీడియోను రూపొందించి, పార్టీ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ''మా పోరాటం కొనసాగుతుంది. అన్ని అవరోధాలను మేము అధిగమిస్తాం. ప్రజా వాణిని వినిపిస్తూనే ఉంటాం'' అంటూ ఆ వీడియోలో కాంగ్రెస్ సందేశం ఇచ్చింది.

Updated Date - 2022-03-15T23:28:32+05:30 IST