న్యూఢిల్లీ: లఖింపూర్‌లో రైతులను కారుతో తొక్కిచంపించిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనిని మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణ చెప్పి, మంత్రిని మాత్రం పదవి నుంచి తొలగించలేదని మోదీపై విమర్శలు గుప్పించారు. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష ఎంపీలు మంగళవారంనాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ ఈ ప్రదర్శన నిర్వహించారు. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీలు నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి
విపక్ష ఎంపీల నిరసన ప్రదర్శనలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లఖింపూర్ ఘటనపై విపక్షాలు మరోసారి తమ వాణి వినిపించాల్సి వస్తోందని అన్నారు. మంత్రి కుమారుడు రైతులను పొట్టనపెట్టుకున్నారని, ఇది మామూలు ఘటన కాదని, దీని వెనుక కుట్ర ఉందని నివేదిక పేర్కొందని, అయినా ప్రధాని దీనిని ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ''మీరు (ప్రధాని) క్షమాపణలు (రైతులకు) చెప్పారు. కానీ మంత్రిని మాత్రం తొలగించలేకపోయారు'' అని రాహుల్ నిలదీశారు. కేంద్రం తక్షణం మంత్రికి ఉద్వాసన పలకాలని డిమాండ్ చేశారు.