రాహుల్‌‌ను ఇలా చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన ప్రజలు!

ABN , First Publish Date - 2021-01-16T16:52:19+05:30 IST

దేశ భవిష్యత్తుకు తమిళ సంస్కృతీసంప్రదాయాలు ఎంతో అవసరమని...

రాహుల్‌‌ను ఇలా చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన ప్రజలు!

చెన్నై, ఆంధ్రజ్యోతి: దేశ భవిష్యత్తుకు తమిళ సంస్కృతీసంప్రదాయాలు ఎంతో అవసరమని, అందుకే పొంగల్‌ పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు తాను ఇక్కడికి వచ్చానని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మదురై జిల్లా అవనియాపురంలో సంక్రాంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం నిర్వహించిన తమిళ సంప్రదాయ, సాహసక్రీడ జల్లికట్టు పోటీలను రాహుల్‌గాంధీ ఆసక్తిగా తిలకించారు. ఇందులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30 గంటలకు మదురై చేరుకున్న రాహుల్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితరులు స్వాగతం పలికారు.


అనంతరం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధితో కలిసి జల్లికట్టు పోటీలు వీక్షించారు. రంకెలేస్తున్న పోట్లగిత్తలను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన యువకులను రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. యువకులు కూడా రాహుల్‌తో చేతులు కలిపేందుకు, ఆయన్ని కలుసుకునేందుకు ఉత్సాహం కనబరించారు. ఈ సందర్భంగా రాహుల్‌  మాట్లాడుతూ.. జల్లికట్టు క్రీడల్లో ఎద్దులను హింసిస్తున్నట్లు కొంతమంది చేసిన వ్యాఖ్యలు విన్నానని, అయితే తాను ప్రత్యక్షంగా చూశాక అలాంటిదేమీ లేదన్నారు. తమిళ ప్రజల సంస్కృతిని కించపరిచేవాళ్లకు, తమిళ భాషను, వారి ఘన వారసత్వాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించే వారికి తగిన సందేశం ఇవ్వడానికే తాను జల్లికట్టు పోటీలను తిలకించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. కేంద్రం వ్యవసాయచట్టాలను వెనక్కి తీసుకోవలసిందేనని పేర్కొన్నారు.


జీన్స్‌ ప్యాంట్‌.. టీషర్టులో..

మధ్యాహ్నం ఒంటిగంటకు అవనియాపురం చేరుకున్న రాహుల్‌గాంధీని చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. నిత్యం తెల్లకుర్తా, పైజామాలో కనిపించే ఆయన.. అవనియాపురానికి జీన్స్‌ ప్యాంట్‌, టీషర్టులో అచ్చు పర్యాటకుడిలా కనిపించారు. రాజకీయ నేతగా కన్నా మనవాడే అన్న భావన కలిగేలా అందరితోనూ కలివిడిగా వ్యవహరించారు. అక్కడే పేద మహిళలు, వృద్ధురాళ్లతో కలిసి బహిరంగ ప్రదేశంలోనే సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి ఆర్థిక స్థితిగతులు, కష్టనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-01-16T16:52:19+05:30 IST