హిజాబ్ ధరించే విద్యార్థినులకు రాహుల్ గాంధీ మద్దతు

ABN , First Publish Date - 2022-02-05T19:24:32+05:30 IST

బాలికా విద్యా పథంలోకి హిజాబ్‌ను తీసుకొచ్చి బాలికల

హిజాబ్ ధరించే విద్యార్థినులకు రాహుల్ గాంధీ మద్దతు

న్యూఢిల్లీ : బాలికా విద్యా పథంలోకి హిజాబ్‌ను తీసుకొచ్చి బాలికల భవిష్యత్తును దోచుకుంటున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని విద్యా సంస్థల్లోకి హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంపై మండిపడ్డారు. సరస్వతీ దేవి ఇటువంటి వివక్షను ప్రదర్శించదని, అందరికీ విజ్ఞానాన్ని ఇస్తుందని అన్నారు. హిజాబ్ ధరించి పాఠశాలలకు వెళ్ళే విద్యార్థినులకు మద్దతిచ్చారు. 


కర్ణాటకలోని ఉడుపి జిల్లా, కుండపూర్‌లో ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు శుక్రవారం ప్రయత్నించగా అధికారులు వారించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్ కోడ్‌ను విధించిందని, అందువల్ల హిజాబ్‌ను ధరించి వచ్చేవారిని అనుమతించబోమని చెప్పారు. దాదాపు మూడు రోజుల నుంచి దీనిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులతో మాట్లాడుతూ, హిజాబ్ లేకుండా తరగతులకు హాజరు కావచ్చునని తెలిపారు. దీంతో కర్ణాటకలో హిజాబ్ ధరించడం ఓ ఉద్యమంలా సాగుతోంది. ముస్లిం విద్యార్థినులు మైసూరులో ‘‘ఐ లవ్ హిజాబ్’’ ఉద్యమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఇది ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఉన్నతాధికారులతో ఓ సమావేశం నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి బీసీ నాగేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


మరోవైపు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత యూటీ ఖాదర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులు బయటికొస్తే రాష్ట్ర ప్రభుత్వం తట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కూడా హిజాబ్ ధరించే విద్యార్థినులకు మద్దతుగా నిలిచారు. నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, మతాచారాల ప్రకారం బట్టలను ధరించే హక్కు అందరికీ ఉందని చెప్పారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులను పాఠశాలల్లో ప్రవేశించకుండా నిషేధించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఇదిలావుండగా వచ్చే ఏడాది శాసన సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రజలను వర్గాలవారీగా విడదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. 


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వసంత పంచమి సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ‘‘విద్యార్థినుల హిజాబ్‌ను వారి విద్యా మార్గానికి అడ్డుగా రానివ్వడం ద్వారా మనం భారత దేశ బాలికల భవిష్యత్తును దోచుకుంటున్నాం. సరస్వతీ మాత అందరికీ విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆమె తేడాలు చూపదు’’ అని పేర్కొన్నారు. 





Updated Date - 2022-02-05T19:24:32+05:30 IST