కోవిడ్ బాధితులపై ఆరెస్సెస్ జోకులు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-05-12T21:09:43+05:30 IST

కోవిడ్ మహమ్మారి బాధితుల్లో సకారాత్మక దృక్పథాన్ని

కోవిడ్ బాధితులపై ఆరెస్సెస్ జోకులు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి బాధితుల్లో సకారాత్మక దృక్పథాన్ని పెంచేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ చేపట్టిన కార్యక్రమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడమంటే, తమ ఆత్మీయులను కోల్పోయినవారిని పరిహసించడమేనని దుయ్యబట్టారు. పాజిటివ్ థింకింగ్ అంటూ ఉపన్యాసాలు ఇస్తూ బాధిత కుటుంబాలపై జోకులేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కొరత తీవ్రంగా ఉందని గుర్తు చేశారు. 


రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘తమ ఆత్మీయులను కోల్పోయిన, ఆక్సిజన్, ఆసుపత్రులు, మందుల సంక్షోభంతో బాధపడుతున్నవారి కుటుంబాలను, హెల్త్ వర్కర్లను పరిహసించడమే ఈ తప్పుడు పాజిటివ్ థింకింగ్ భరోసా’’ అని పేర్కొన్నారు. తలను ఇసుకలో దూర్చినంత మాత్రానికి పాజిటివిటీ రాదన్నారు. ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు. 


రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశం ఏమిటంటే, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘కోవిడ్ రెస్పాన్స్ టీమ్’ (సీఆర్‌టీ) ఇటీవల ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఆర్‌టీని ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలు, కొన్ని పౌర సేవల సంఘాలు ఏర్పాటు చేశాయి. ప్రజల్లో ఆత్మవిశ్వాసం, సకారాత్మక ధోరణి (పాజిటివిటీ)లను నింపేందుకు ప్రముఖుల చేత ఉపన్యాసాలను ఇప్పిస్తోంది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, విప్రో గ్రూప్ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ వంటివారు ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలు చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీఆర్‌టీ కన్వీనర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రసంగాలు ఆరెస్సెస్‌కు చెందిన విశ్వ సంవాద్ కేంద్రం ఫేస్‌బుక్, యూట్యూబ్ పేజీల్లో ప్రసారమవుతాయన్నారు. 


Updated Date - 2021-05-12T21:09:43+05:30 IST