Rahul Birthday Special: 53వ పడిలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ.. మాయని మచ్చ మాత్రం ఆ పరిణామమే..

ABN , First Publish Date - 2022-06-19T21:37:32+05:30 IST

దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ. ఒకప్పుడు దేశాన్ని ఏక ఛత్రాదిపత్యంగా ఏలిన ఆ పొలిటికల్ పార్టీ ఇప్పుడు మళ్లీ..

Rahul Birthday Special: 53వ పడిలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ.. మాయని మచ్చ మాత్రం ఆ పరిణామమే..

దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ. ఒకప్పుడు దేశాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన ఆ పొలిటికల్ పార్టీ ఇప్పుడు మళ్లీ ఆ పూర్వ వైభవం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ మరేదో కాదు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC). కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కృషి చేస్తుంటే ఈడీ కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. ఈడీ కేసులు, ఆటుపోట్లు, సూటిపోటి మాటలు, విమర్శలు, ఆరోపణలు.. ఇదీ ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ రాజకీయ జీవితం. ఈ కాంగ్రెస్ ఆశా కిరణం ఆదివారం నాడు 53వ పడిలోకి అడుగుపెట్టారు. 2004 నుంచి ఫుల్ టైం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్‌కు రాజకీయాలు చాలానే నేర్పాయి. దాదాపు 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న రాహుల్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వారసత్వం కలిసొచ్చినా రాజకీయాల్లో విజయం సాధించేందుకు మాత్రం ఆ వారసత్వం సరిపోలేదు.



ప్రత్యర్థులు రాహుల్ గాంధీపై ఒక అసమర్థ రాజకీయ నేతగా ముద్ర వేశారు. రాహుల్‌ను నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవడం ఖాయమన్నారు. ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక పరిణతి చెందిన రాజకీయ నేతగా ఎదిగేందుకు రాహుల్ గాంధీ చాలానే శ్రమపడ్డారు. మూడు సార్లు అమేథీ నుంచి, ప్రస్తుతం వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ గెలుపొందారు. రాహుల్‌ గాంధీకి మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో రెండు సార్లు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చినా ఆ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. 2013లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆ బాధ్యతలు సమర్థంగానే నిర్వహించినప్పటికీ 2015 ఫిబ్రవరి 23 నుంచి 56 రోజుల పాటు రాహుల్ గాంధీ రాజకీయాలకు దూరంగా ఉండటం అప్పట్లో సంచలనం రేపింది. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్‌పై తీవ్ర విమర్శలకు కారణమైంది. అమేథీలో ‘రాహుల్ గాంధీ కనిపించడం లేదు’ అంటూ పోస్టర్లు కనిపించడంతో పెను దుమారం రేగింది. ఈ ఎపిసోడ్ రాహుల్ రాజకీయ జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.



దీంతో.. పాటు రాహుల్ గాంధీ పెళ్లిపై కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. వెరోనికా అనే యువతితో రాహుల్ గాంధీ ప్రేమాయణం సాగించినట్లు ఆ సమయంలో వార్తలొచ్చాయి. అయితే.. ఆమె తన ఆప్త మిత్రురాలని రాహుల్ చెప్పారు. కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీ నైట్ పబ్‌లో అమ్మాయితో జల్సా చేస్తున్నాడంటూ బీజేపీ సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొట్టడంతో రాజకీయంగా ఆ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఖాట్మండులో తన మిత్రురాలి వివాహానికి హాజరయిన సమయంలో ఆయన తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లినట్టు తేలడంతో ఆ వివాదం సమసిపోయింది. ప్రస్తుతం రాహుల్ గాంధీని ఈడీ కేసులు కలవరపెడుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయనపై, సోనియాపై ఈడీని కేంద్రం ఉసిగొల్పిందంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలంగా వాదిస్తోంది. రాహుల్‌పై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి. ఈ ఈడీ ఎపిసోడ్ కాంగ్రెస్‌పై ఎంతో కొంత సానుభూతికి కారణమయి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఎన్నికల నాటికి ఈ అంశం ఎంత మేర ప్రభావం చూపుతుందో, కాంగ్రెస్‌కు ఏ మాత్రం కలిసొస్తుందో అప్పుడే అంచనా వేయలేమని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



ఇక.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయానికొస్తే.. వయసు రీత్యా కూడా సోనియా గాంధీ ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వహించలేకపోవచ్చని, రాహుల్ గాంధీ నాయకత్వం వహించాల్సిన పరిస్థితులు అనివార్యమని ఆ పార్టీ సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ అడుగులేయాల్సిన అవసరం ఉందని, సీనియర్లను అందరినీ కలుపుకునిపోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమర్థ నాయకుడిగా రాహుల్ తనను తాను నిరూపించుకోవాల్సిన తరుణం ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే కచ్చితంగా రాహుల్ గాంధీ రాజకీయంగా తానేంటో, తన నాయకత్వ పటిమ ఏంటో రుజువు చేసుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధం కాగా, తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని రాహుల్ సూచించారు. ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న ఈ సమయంలో తన పుట్టినరోజ కంటే వీధుల్లో నిరసన చేస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని రాహుల్ పార్టీ శ్రేణులకు సూచించారు.

Updated Date - 2022-06-19T21:37:32+05:30 IST