సంగతేంటి బాస్‌?

ABN , First Publish Date - 2021-01-25T12:50:42+05:30 IST

రాహుల్‌గాంధీ.. దేశంలోని మొట్టమొదటి అతిపెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి. ప్రస్తుతం దేశంలో వున్న ప్రతిపక్ష పార్టీలకు చుక్కానిలా కనిపిస్తున్న నేత.. అలాంటి ...

సంగతేంటి బాస్‌?

ఆయన వీరి పేరెత్తడు.. వీరు ఆయన ఊసెత్తరు?

రాహుల్‌ ప్రచారంలో కనిపించని కూటమి నేతలు

చెన్నై(ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ.. దేశంలోని మొట్టమొదటి అతిపెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి. ప్రస్తుతం దేశంలో వున్న ప్రతిపక్ష పార్టీలకు చుక్కానిలా కనిపిస్తున్న నేత.. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో ప్రచారానికి వస్తే ఆయన కూటమి పార్టీలకు పండుగే కావాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మూడు రోజుల పర్యటన కోసం శనివారం కోయంబత్తూరు వచ్చిన రాహుల్‌ను డీఎంకే కూటమిలోని నేతలెవ్వరూ కలవకపోవడం చర్చనీయాంశమైంది. డీఎంకే, సీపీఎం, సీపీఐ, మణిదనేయ మక్కల్‌ కట్చి తదితర పార్టీలేవీ రాహుల్‌వైపు కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో ఆయా పార్టీలకు చెందిన పత్రికలు, ఛానళ్లలోనూ రాహుల్‌కు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఈనెల 14వ తేదీన మదురై జిల్లా అవనియాపురంలో జల్లికట్టు చూసేందుకు వచ్చిన రాహుల్‌తో డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి మాత్రం భేటీ అయ్యారు. రాహుల్‌తో కలిసి జల్లికట్టు వీక్షించివెళ్లారు. కానీ ఈ మూడు రోజుల పర్యటనలో మాత్రం డీఎంకేతో పాటు కూటమి నేతలెవ్వరూ పాల్గొనలేదు. అదే సమయంలో రాహుల్‌గాంధీ కూడా తన ప్రచారంలో కూటమి ప్రస్తావన తీసుకురావడం లేదు. తమ పార్టీని బలపరచాలని, మంచి ప్రభుత్వాన్ని ఇస్తామనంటూ చెబుతున్నారే తప్ప డీఎంకే కూటమికి ఓటేయాలని గానీ, స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేద్దామని గానీ చెప్పడం లేదు. సహజంగా ఆయా పార్టీలకు చెందిన బడా నేతలు ప్రచారానికి వచ్చినప్పుడు కూటమి పార్టీలు కూడా వస్తుంటాయి. కానీ రాహుల్‌గాంధీ ప్రచారంలో కాంగ్రెస్‌ జెండాలు మినహా మరే పార్టీ పతాకం కనిపించడం లేదు. దీంతో కూటమిలో అంతా సవ్యంగానే వుందా అన్న అనుమానం తలెత్తుతోంది. దీనిపై రాజకీయవర్గాల్లో రకరకాలా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

Updated Date - 2021-01-25T12:50:42+05:30 IST