ప్రభుత్వోద్యోగాలపై నిషేధం లేదు

ABN , First Publish Date - 2020-09-06T14:23:43+05:30 IST

ప్రభుత్వోద్యోగాల నియామకాలపై ఎలాంటి నిషేధం, లేదా ఆంక్షలు విధించలేదని.

ప్రభుత్వోద్యోగాలపై నిషేధం లేదు

ఆర్థిక శాఖ సర్క్యులర్‌పై కేంద్రం వివరణ

మోదీది ‘కనిష్ఠ పాలన, గరిష్ఠ ప్రైవేటీకరణ’

ప్రధానిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ట్వీట్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: ప్రభుత్వోద్యోగాల నియామకాలపై ఎలాంటి నిషేధం, లేదా ఆంక్షలు విధించలేదని. ఉద్యోగాల భర్తీ యథావిధిగా కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం స్పష్టం చేసింది. అప్రధాన అంశాలపై వ్యయాన్ని తగ్గించాలని కోరుతూ ఆర్థిక శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. అభివృద్ధికి సంబంధం లేని వ్యయానికి కోతపెట్టి, కీలకమైన పథకాలకు తగినస్థాయిలో నిధులను సమీకరించి, ప్రభుత్వపరమైన వ్యయాన్ని మెరుగుపరచాల్సిందిగా ప్రభుత్వం ఈ సర్క్యులర్‌లో ఆదేశించింది. కన్సల్టంట్లను కనీస స్థాయికి తగ్గించుకోవాలని, పుస్తకాలు, డాక్యుమెంట్లు, ప్రచురణల ముద్రణకు దిగుమతి చేసుకున్న పేపర్‌ వాడకాన్ని నిలిపివేయాలని కూడా ఆదేశించింది. వివిధ శాఖలు, విభాగాలలోని కన్సల్టంట్ల సేవల నాణ్యతకు తగ్గట్టుగానే వారికి ఫీజులు చెల్లించాలని కూడా ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కొత్త పోస్టుల సృష్టిపై నిషేధం విధించింది. వ్యయ విభాగం స్పష్టంగా ఉత్తర్వులిస్తే తప్ప కొత్తగా పదవులను/పోస్టులను సృష్టించవద్దని అన్ని శాఖలనూ ఆదేశించింది. ఈ ఏడాది జూలై ఒకటి తర్వాత కొత్తగా సృష్టించిన పోస్టులలో ఇంకా నియామకాలు జరగకపోతే వాటి అనుమతి కోసం వ్యయశాఖకు తాజాగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్థిక శాఖ ఆదేశించింది. అయితే ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు చేయడంతో కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వివరణ ఇచ్చింది.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వంలో కొత్త పోస్టుల సృష్టిపై నిషేధాన్ని విధిస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ శనివారం డిమాండ్‌ చేసింది. నిరుద్యోగం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసి, యువతకు ఉపాధి కోసం మరిన్ని పోస్టులు సృష్టించాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ డిమాండ్‌ చేశారు. మోదీ సర్కారును దుయ్యబడుతూ శనివారం ఆయన ట్వీట్లు చేశారు. మోదీ ప్రభుత్వ పనితీరు..‘‘కనిష్ఠ పాలన, గరిష్ఠ ప్రైవేటీకరణ’’ అన్న ధోరణిలో సాగుతోందని రాహుల్‌ విమర్శించారు.

Updated Date - 2020-09-06T14:23:43+05:30 IST