ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఆ తేదీ ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-06-21T23:11:51+05:30 IST

భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20కి ప్రత్యేక గుర్తింపు ఉంది. టీమిండియాలో దిగ్గజ క్రికెటర్లుగా పేరుగాంచిన మిస్టర్

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఆ తేదీ ప్రత్యేకం!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20కి ప్రత్యేక గుర్తింపు ఉంది. టీమిండియాలో దిగ్గజ క్రికెటర్లుగా పేరుగాంచిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్,  సౌరవ్ గంగూలీ, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తమ అరంగేట్ర మ్యాచ్‌ను ఇదే తేదీన ఆడారు. 1996లో ద్రవిడ్, గంగూలీ ఒకేసారి ఇదే రోజున టెస్టుల్లో అడుగుపెడితే.. 20 జూన్ 2011న కోహ్లీ తన మొదటి టెస్ట్ మ్యాచ్‌ ఆడాడు. 


1996లో లార్డ్స్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో గంగూలీ ఫస్ట్ డౌన్‌లో వచ్చి 131 పరుగులు చేసి తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. తర్వాత ఏడో నంబరులో క్రీజులోకి వచ్చిన ద్రవిడ్ 267 బంతుల్లో 95 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ శతకాన్ని చేజార్చుకున్నాడు. లార్డ్స్‌‌లో జరిగిన ఈ మ్యాచ్‌ గురించి ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. తర్వాత 2011 జూన్‌ 20న కోహ్లీ తన తొలి టెస్టు మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో ఆడాడు.


అయితే ఈ మ్యాచులో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా 4,15 రన్స్‌ చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లోనూ ద్రవిడ్ ఆడాడు. అప్పటికి ద్రవిడ్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అయింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 67 బంతుల్లో 40 పరుగులు చేసిన ద్రవిడ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచరీ నమోదు చేశాడు. ముగ్గురు దిగ్గజ బ్యాటర్లు ఒకే తేదీన టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అరుదైన విషయం. అందుకే జూన్ 20వ తేదీకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. 

Updated Date - 2022-06-21T23:11:51+05:30 IST