టీమిండియా చీఫ్‌ కోచ్‌గా ద్రావిడ్‌!

ABN , First Publish Date - 2021-10-17T08:14:38+05:30 IST

టీమిండియా చీఫ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ నియామకం దాదాపుగా ఖరారైంది. టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ ముగుస్తుంది.

టీమిండియా చీఫ్‌ కోచ్‌గా ద్రావిడ్‌!

ఒప్పించిన గంగూలీ, షా

బౌలింగ్‌ కోచ్‌గా మాంబ్రే


న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ నియామకం దాదాపుగా ఖరారైంది. టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ ముగుస్తుంది. అతడి స్థానంలో 48 ఏళ్ల ద్రావిడ్‌ గురువుగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2023 వరకు అంటే రెండేళ్లపాటు రాహుల్‌ ఈ పదవిలో కొనసాగనున్నాడు. కోచ్‌గా ఉండడానికి ద్రావిడ్‌ తొలుత విముఖత వ్యక్తం చేసినా.. ఆ తర్వాత బీసీసీఐ జరిపిన చర్చలతో మనసు మార్చుకొన్నాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా.. ద్రావిడ్‌తో మాట్లాడి భారత జట్టు కోచ్‌ బాధ్యతలు చేపట్టడానికి ఒప్పించినట్టు సమాచారం.


న్యూజిలాండ్‌తో సిరీస్‌ నుంచి ద్రావిడ్‌ హెడ్‌ కోచ్‌గా సేవలు అందించనున్నాడు. ప్రసుత్తం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న ద్రావిడ్‌.. త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటాడని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ద్రావిడ్‌ నియామకంపై తనకు ఎటువంటి సమాచారం లేదని దుబాయ్‌లో ఉన్న కోహ్లీ అన్నాడు. రాహుల్‌ ఎంతో విశ్వసించే పరాస్‌ మాంబ్రేను బౌలింగ్‌ కోచ్‌గా నియమించనున్నారు. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ కొనసాగనుండగా.. ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ విషయంపై బోర్డు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. అయితే, నిబంధనల ప్రకారం కోచ్‌ కోసం ప్రకటన ఇవ్వడం, లోధా కమిటీ సిఫారసుల మేరకు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)ను ఏర్పాటు చేయనుంది.  


జీతం రూ. 10 కోట్లపైనే?

ప్రస్తుత కోచ్‌గా ఉన్న శాస్త్రికి ఏడాదికి రూ. 8.5 కోట్ల జీతాన్ని బీసీసీఐ ముట్టజెబుతోంది. ఈ నేపథ్యంలో ద్రావిడ్‌ జీతాన్ని కూడా భారీగా పెంచే అవకాశం ఉంది. కచ్చితమైన సమాచారం వెలువడక పోయినా.. రాహుల్‌కు ఏడాదికి రూ. 10 కోట్లు చెల్లించడానికి బోర్డు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. 

Updated Date - 2021-10-17T08:14:38+05:30 IST