రాహుల్‌కు చరిత్ర తెలియదు: రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2022-02-19T21:15:04+05:30 IST

రేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత చైనా, పాకిస్థాన్‌లు బాగా దగ్గరయ్యారని రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను..

రాహుల్‌కు చరిత్ర తెలియదు: రాజ్‌నాథ్

గోండా: నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత చైనా, పాకిస్థాన్‌లు బాగా దగ్గరయ్యారని రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిప్పికొట్టారు. ప్రాచీన భారతదేశ చరిత్రను రాహుల్ చదవలేదని, కనీసం నవీన భారతదేశ చరిత్రనైనా చదివితే బాగుంటుందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఎన్నికల ప్రచార సభలో రాజ్‌నాథ్ శనివారంనాడు మాట్లాడుతూ, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే అక్రమంగా స్వాధీనం చేసుకుని సక్సగమ్ లోయను చైనాకు పాకిస్థాన్ అప్పగించిందని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కరకోరం హైవో నిర్మాణం జరిగినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారని, సీపీఈసీ మొదలైనప్పుడు మన్‌మోహన్ ప్రధానిగా ఉన్నారే కానీ మోదీ కాదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.


గాల్వాన్ లోయలో చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైనికులు పెద్దఎత్తున చనిపోయారని, ముగ్గురు నలుగురు మాత్రమే చైనా జవాన్లు చనిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పడం బాధాకరంగా అనిపించిందని ఆయనపేర్కొన్నారు. ఒక రక్షణ మంత్రిగా తాను సమాధానం చెప్పాల్సి ఉన్నప్పటికీ.. వాళ్లను మాట్లాడనీయండంటూ ప్రధాని చెప్పడంతో తాను సమాధానం ఇవ్వలేదని అన్నారు. అయితే అసలు వాస్తవాలు ఏమిటో తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రకటన చేసిన తరవాత ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు గాల్వాన్ ఘర్షణల్లో 28 నుంచి 50 మంది చైనా జవాన్లు మరణించినట్టు కథనం రాశారని రాజ్‌నాథ్ చెప్పారు.


ఏటా హోలీ, దీపావళికి ఉచిత ఎల్‌పీజే సిలెండర్లు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన మొదటి రెండు విడతల ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లకు కాస్త అటూఇటూగా బీజేపీకి సీట్లు వస్తాయని ఎన్నికల విశ్లేషకులు, సర్వే ఏజెన్సీలు చెబుతున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు. యూపీలో బీజేపీకి మళ్లీ అధికారం ఇస్తే, బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏటా హోలి, దీపావళి పండుగలకు ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు ఇస్తుందని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-02-19T21:15:04+05:30 IST