Rahul Bhat killing: సిట్ ఏర్పాటుకు LG ఆదేశం

ABN , First Publish Date - 2022-05-15T22:21:02+05:30 IST

రాహుల్ భట్‌‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా...

Rahul Bhat killing: సిట్ ఏర్పాటుకు LG ఆదేశం

శ్రీనగర్: రాహుల్ భట్‌ (Rahul Bhat)ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ (LG) మనోజ్ సిన్హా (Manoj sinha) ఆదివారంనాడు ఖండించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గత శుక్రవారంనాడు కశ్మీర్ పండిట్ ఉద్యోగులు నిరనసలకు దిగారు. ప్రదర్శకులపై పోలీసులు బుద్గాంలోని షేక్‌పోర లాఠీచార్జి జరపడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. భట్ హత్యపై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం ఇందుకోసం 'సిట్' (SIT) ఏర్పాటు చేసింది. 


''భట్ హత్య టార్గెటెడ్ కిల్లింగ్. భయోత్పాతం సృష్టించేందుకు జరిగిన ప్రయత్నం. ఆయన చాలా మంది ఉద్యోగి. ఈ ఘటనపై దర్యాప్తునకు మేము సిట్ ఏర్పాటు చేశాం. ఎస్‌హెచ్‌ను కూడా అటాచ్ చేశాం. అన్ని కోణాల్లోంచి సిట్ దర్యాప్తు జరుపుతుంది'' అని సిన్హా తెలిపారు. నిరసనకారులపై పోలీసు ఫోర్స్ ఉపయోగించడంపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతుందని, ఉద్యోగులకు వారం రోజుల్లో  సురక్షితమైన ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. వారికి ఉన్న ఇతర సమస్యలపై కూడా దృష్టిసారిస్తామని, ఉద్యోగుల ఆవేదన, కష్టాలను తాము అర్ధం చేసుకోగలమని అన్నారు. ఉద్యోగులు ఎక్కడ నివసిస్తే అక్కడ వారికి పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పోలీసు చర్య అవసరం లేదని కూడా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్టు సిన్హా చెప్పారు.


కశ్మీర్‌లో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని సిన్హా చెప్పారు. శాంతియుత వాతావరణం చెక్కుచెదరకుండా ఉండేందుకు అంతా కలిసికట్టుగా ఉండాలని రాజకీయ పార్టీలు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణాన్ని భంగపరచే వారి ఆటలు సాగనీయమని, రాహుల్ భట్ హత్యతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న ఇద్దరు విదేశీ ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారని చెప్పారు. ఇలాంటి హత్యా ఘటనలకు పాల్పడుతున్న శక్తులను Social boycott చేయాలని ప్రజలను, పార్టీలకు సిన్హా కోరారు.

Updated Date - 2022-05-15T22:21:02+05:30 IST