రాహుల్‌ యాత్ర ఖరారు

ABN , First Publish Date - 2022-10-02T05:46:29+05:30 IST

రాహుల్‌ యాత్ర ఖరారు

రాహుల్‌ యాత్ర ఖరారు

  • ఉమ్మడి జిల్లాలో 4 రోజుల పాటు భారత్‌ జోడో యాత్ర
  • 70కి.మీ నడవనున్న రాహుల్‌గాంధీ

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోకి ఈనెల 24న ప్రవేశించనుంది. జిల్లాలో పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగేలా పార్టీ నాయకులు ప్రణాళిక రూపొందించారు. 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో పాదయాత్రలో స్వల్ప మార్పులు చేశారు. పార్టీని ప్రజలకు చేరువచేసేందుకు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు నూతన రంగారెడ్డి జిల్లా పరిధిలోనే రాహుల్‌ పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ అధినాయకత్వం పేర్కొన్నప్పటికీ తాజాగా మేడ్చల్‌ జిల్లా పరిధిలో కూడా పాదయాత్ర సాగే విధంగా షెడ్యూల్‌లో మార్పు చేశారు. అలాగే ఈ యాత్రలో అన్ని నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్‌ పాదయాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కాంగ్రెస్‌ అధినాయకత్వం శనివారం విడుదల చేసింది. ఏయే రోజు ఏ ప్రాంత నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొవాలనే వివరాలను కూడా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజుల పాటు యాత్ర కొనసాగనున్నప్పటికీ ఉమ్మడి జిల్లా నేతలు ఆరు రోజుల పాటు యాత్రలో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 70కి.మీ పాటు రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాదయాత్ర వివరాలను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది అక్టోబర్‌ 24వ తేదీన మక్తల్‌ నియోజకవర్గంలోని కృష్ణానది బ్రిడ్జి గుండా రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశించనుంది. రాహుల్‌ పాదయాత్ర రాష్ట్రంలో 375కిలో మీటర్ల మేర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ సగటు రోజుకు 20 నుంచి 25కి.మీ వరకు పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాతల్రో భాగంగా రాహుల్‌గాంధీ ఉమ్మడి జిల్లాలో కూడా నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. జిల్లాలోని బాలానగర్‌ నుంచి రాహుల్‌ పాదయాత్ర ప్రారంభంకానుంది. బాలానగర్‌ నుంచి షాద్‌నగర్‌, శంషాబాద్‌, ఆరమ్‌ఘర్‌ మీదుగా హైదరాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించనుంది. అక్కడ నుంచి మూసాపేట బ్రిడ్జి మీదుగా మేడ్చల్‌ జిల్లాలోకి ప్రవేశించనుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్రలో ఉమ్మడి జిల్లా నేతలంతా పాల్గొనే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 


  • రాహుల్‌ పాదయాత్రలో  పాల్గొననున్న ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు ఇలా...

మొదటి రోజు మక్తల్‌ అసెంబ్లీ పరిధిలో జరిగే భారత్‌ జోడో యాత్రలో కొడంగల్‌ అసెంబ్లీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. 

3వ రోజు మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ పరిధిలో జరిగే రాహుల్‌ పాదయాత్రలో వికారాబాద్‌ జిల్లా పరిధిలోని తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. 

5వ రోజు షాద్‌నగర్‌ అసెంబ్లీ పరిధిలో జరిగే యాత్రలో స్థానికులతో పాటు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

6వ రోజు శంషాబాద్‌లో జరిగే యాత్రలో రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు.

7వ రోజు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే పాదయాత్రలో వికారాబాద్‌, చేవెళ్ల, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు 

8వ రోజు బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతంలో జరిగే యాత్రలో మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గ నేతలంతా పాల్గొంటారు.

Updated Date - 2022-10-02T05:46:29+05:30 IST