రగిలిన హృదయాలకు ‘రాహత్‌’

ABN , First Publish Date - 2020-04-13T06:07:42+05:30 IST

ముస్లిం అస్తిత్వవాదానికి పెద్ద పీట వేసిన రాహత్‌కు మతాలకతీతంగా అసాధారణమైన ఆదరణ ఉంది. ఉర్దూలో ‘రాహత్‌’ అంటే ఊరట అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అనేక సమస్యలతో సతమతమయ్యేవారికి ఆయన షాయిరీ సాంత్వన కలిగిస్తుంది...

రగిలిన హృదయాలకు ‘రాహత్‌’

ముస్లిం అస్తిత్వవాదానికి పెద్ద పీట వేసిన రాహత్‌కు మతాలకతీతంగా అసాధారణమైన ఆదరణ ఉంది. ఉర్దూలో ‘రాహత్‌’ అంటే ఊరట అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అనేక సమస్యలతో సతమతమయ్యేవారికి ఆయన షాయిరీ సాంత్వన కలిగిస్తుంది.  


‘‘మై అప్నీ లాష్‌ లియే ఫిర్‌ రహా హూఁ కాంధే పర్‌

యహాఁ జమీన్‌ కీ కీమత్‌ బహుత్‌ జ్యాదా హై’’

(నేను నా శవాన్ని భుజాలకెత్తుకుని తిరుగుతున్నా

ఇక్కడ భూమి రేటు చాలాచాలా ఎక్కువ)


ఆయనో గజల్‌ ఝురి. తన షాయిరీతో జలపాతాలను నిలువరిస్తాడు. సూర్యుడితో సంభాషిస్తాడు. కన్నుగీటి జాబిలిని ఆకాశం నుంచి డాబా మీదికి దింపుతాడు. ప్రియు రాలి కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గజల్‌కు బంధనాలు తెంచేసి స్వేచ్ఛనిస్తాడు. షాయిరీ రసజ్ఞులను కాల్పనిక ప్రపంచం నుంచి వాస్తవంలోకి తీసుకొస్తాడు. జీవితంలోని చేదు నిజాలకు పర్దా తొలగిస్తాడు. దైవం, మతం, మత కలహాలు, మానవత్వం, రాజకీయాలు, దేశభక్తి, కపటత్వం, చట్టం, న్యాయం, వివక్ష, ముస్లింలు, ఉగ్రవాదం... ఇలా అన్నింటి పైనా గజళ్లు రాసి ఉర్దూ షాయిరీలో తనకంటూ భారత్‌లోనే కాకుండా విదేశాలలో సైతం విశిష్ట స్థానం సంపాదించుకున్నాడు. ఆయనే ప్రముఖ ఉర్దూ షాయర్‌ రాహత్‌ ఇందోరీ. గత 50ఏళ్లుగా అసంఖ్యాకమైన ముషా యిరాలలో తన కవితను వినిపించిన రాహత్‌... గజల్‌కు కొత్త వన్నెలద్దాడు. ఆయన ముషాయిరా వేదికపై ఉంటే అర్ధరాత్రి కాదు... తెల్లవారుజాముదాకా కూడా నిద్ర కాచేం దుకు సిద్ధపడే ఆహాతులు కోకొల్లలు. ముస్లిం అస్తిత్వవాదా నికి పెద్దపీట వేసిన రాహత్‌కు మతాలకతీతంగా అసాధారణ మైన ఆదరణ ఉంది. ఉర్దూలో ‘రాహత్‌’ అంటే ఊరట అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అనేక సమస్యలతో సతమతమ య్యేవారికి ఆయన షాయిరీ సాంత్వన కలిగిస్తుంది.  


మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో 70ఏళ్ల క్రితం పుట్టిన రాహత్‌ అసలు పేరు రాహత్‌ కురేషీ. ఆయన గొప్ప కవేకాదు అద్భుతమైన పెయింటర్‌, బాలీవుడ్‌లో ప్రముఖ గీత రచయిత కూడా. గజల్‌, నజ్మ్‌, రుబాయీలు రాయడం ఒక ఎత్తయితే ముషాయిరాలలో వాటిని ఆహాతుల మనసుకు హత్తుకు నేలా శక్తిమంతంగా చెప్పగలగడం చాలా ముఖ్యం. ఈ కళలో ఆయన పండిపోయారు. ఇందోర్‌ యూనివర్సిటీలో రాహత్‌ 30 ఏళ్లపాటు విద్యార్థులకు ఉర్దూ సాహిత్యాన్ని, షాయిరీని బోధించారు. గజల్‌ను, నజ్మ్‌ను ఎలా చదవాలి? ఎలా అధ్యయనం చేయాలి? ఎలా బోధించాలి? వాటిలోని ప్రతీకాత్మక భావనలను, గాఢతను, నిగూఢతను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఆయనకు కరతలా మలకం. అందుకే ఆయన ముషాయిరా వేదికలపై అంతే ఉత్సాహంగా గజల్‌ వినిపించి ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. దశాబ్దాల తరబడి షాయిరీ రాస్తున్నా ప్రాసంగి కతను కోల్పోని అరుదైన షాయర్‌ ఆయన. ఎందుకంటే ఏళ్ల క్రితం రాసిన గజళ్లు కూడా ప్రస్తుత వాతావరణానికి అద్దం పడతాయి. రాహత్‌ తన కవితా ప్రస్థానంలో ప్రభు త్వాలు, రాజకీయ నాయకులు, కోర్టులు, మీడియా ఎవర్నీ ఖాతరీ చేయలేదు. మన దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ షేర్‌లో చెప్పారు:


‘‘సరహదోం పర్‌ బహుత్‌ తనావ్‌ హై క్యా?

కుఛ్‌ పతా తో కరో, చునావ్‌ హై క్యా?’’

(సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలున్నాయా?

అడిగి చూడు, ఎన్నికలు జరగబోతున్నాయా?)

‘‘ఫైస్లా జో కుఛ్‌ భీ హో మంజూర్‌ హోనా చాహియే

జంగ్‌ హో యా ఇష్క్‌ హో భర్పూర్‌ హోనా చాహియే!’’

(నిర్ణయం ఏదైనా మనమంతా సమ్మతించాల్సిందే!

రణమైనా, ప్రణయమైనా మనసారా చేయాల్సిందే!!)

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య వివాదాల్లో అమెరికా పదేపదే వేలుపెట్టడాన్ని కవి తప్పుబడతాడు. భారత్‌, పాక్‌, అమెరికా లకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దలను ప్రతీకలుగా పేర్కొంటూ ఇలా చెప్పాడు:


‘‘ఖౌఫ్‌ బిఖరా హై దోనోం సంతోం మే

తీసరీ సంత్‌ కా దబావ్‌ హై క్యా?’’

(ఇరువురు మతపెద్దల్లో భయాలున్నాయి.

మూడో మతపెద్ద ఒత్తిళ్లున్నాయా?)

భిన్న మతస్థులు, కులస్థులు పలు అనుమానాలు, అపోహ లతో కలిసి జీవించే భారత్‌ ప్రత్యేకత ఏంటో వివరిస్తాడు రాహత్‌:


‘‘హమ్‌ అప్నీ జాన్‌ కే దుష్మన్‌ కో అప్నీ జాన్‌ కహ్‌తే హైఁ

మొహబ్బత్‌ కీ ఇసీ మిట్టీ కో హిందుస్థాన్‌ కహతే హైఁ’’

(ఆగర్భ శత్రువును మనం ప్రాణంగా భావిస్తాం!

ప్రేమను పంచే ఈ భూమిని భారత్‌గా భావిస్తాం)

న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ను ఉగ్రవాదులు పేల్చేసిన తర్వాత ఉర్దూ ముషాయిరాల ఇతివృత్తాలే మారి పోయాయి. బాబరీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మత కలహాలు, దేశంలో అనేక చోట్ల బాంబు పేలుళ్ల అనంతరం విధ్వంసకారులను ఎండగట్టడం, దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటుపడడం, దేశభక్తిని చాటుకోవడం షాయర్లకు అనివార్యత లుగా మారాయి. భారత సమాజంలో మతపరంగా చీలికలు షాయర్లపై తీవ్ర ప్రభావమే చూపించాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ్‌పరివార్‌ ఎజెండా అమలు, మైనారిటీలపై మూకదాడులు పెరగడం, బలవంత మతమార్పిడులు, సహిష్ణుత ప్రశ్నార్థకమై ఊపిరాడని వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ముస్లిం షాయర్ల గొంతు క్రమంగా బలహీనమవుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, సత్యసంధతతో ముస్లిం అస్తిత్వవాదంపై షాయిరీ చెపుతున్న కొద్దిమంది కవులలో రాహత్‌ ఒకరు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు నిరసనగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ముషాయిరాలో ఆయన చెప్పిన షాయిరీ ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసింది. గత ఆరేళ్లలో ప్రధాని మోదీని రాహత్‌ ఇందోరీ విమర్శించినట్లుగా బహుశా ఏ కవీ, కళాకారుడూ వ్యాఖ్యలు చేసి ఉండరు. సీఏఏ గురించి ప్రస్తావిస్తూ ఈ షేర్‌లు చెప్పారు:


‘‘అప్నీ పహెచాన్‌ మిటానే కో కహా జాతా హై

 బస్తియాఁ ఛోడ్‌ కే జానే కో కహా జాతా హై’’ 

(మన అస్తిత్వాన్నే తుడిచిపెడతామంటారు

బస్తీలు వదిలి ఎక్కడికో పొమ్మంటారు)

హమీ బునియాద్‌ కా పత్థర్‌ హైఁ లేకిన్‌

హమే ఘర్‌ సే నికాలా జా రహా హై

(మేమే ఇంటికి పునాదిరాళ్లం, కానీ

మమ్మల్ని బయటకు వెళ్లగొడుతున్నారు)

పొంచి ఉన్న శత్రువులపై ఎలా పోరాడాలో చెబుతున్నాడిలా:

‘‘మై జాన్తా హూఁ కి దుష్మన్‌ భీ కమ్‌ నహీఁ హైఁ

లేకిన్‌ హమారీ తరహ్‌ హథేలీ పే జాన్‌ థోడీ హై’’

(నాకు తెలుసు- శత్రువులు తక్కువేమీ లేరు.

కానీ, మాలా తెగువ చేసేవాళ్ళెవరూ లేరు)

ఈ దేశం అన్ని కులాలూ, మతాల వారిదీ అని అంటాడాయన:

‘‘సభీ కా ఖూన్‌ హై షామిల్‌ యహాఁ కీ మిట్టీ మే

కిసీ కే బాప్‌ కా హిందుస్థాన్‌ థోడీ హై’’

(ఈ నేలలో మనందరి రక్తం ఇంకింది.

భారత్‌ ఎవడబ్బ దేశం కాదు!)

భారత్‌-పాక్‌ సంబంధాలు బలపడాలనీ, శాంతి విరబూయా లనీ రాహత్‌ కోరుకుంటాడు. అయితే కాలానుగుణంగా మనం ఎలా మారాలో చెపుతున్నాడు:


‘‘జో తౌర్‌ హై దునియా కా, ఉసీ తౌర్‌ సే బోలో

బెహరోం కా ఇలాకా హై, జరా జోర్‌ సే బోలో

దిల్లీ మే హమ్‌ హీ బోలా కరే అమన్‌ కీ బోలీ

యారో, కభీ తుమ్‌ లోగ్‌ భీ లాహోర్‌ సే బోలో’’

(లోకం తీరులోనే మనమూ మాట్లాడాలి

ఇది చెవిటి మా‘లోకం’, ఇంకా గట్టిగా చెప్పాలి

శాంతిపై దిల్లీలో మనమే మాట్లాడుతున్నాం

మిత్రులారా, మీరైనా లాహోర్‌తో మాట్లాడండి)

కవి తన సత్యసంధత, రుజువర్తన గురించి ఎంత ఆత్మ విశ్వాసంతో చెప్పుకుంటున్నాడో చూడండి.

‘‘మేరా జమీర్‌, మేరా ఎతెబార్‌ బోల్తా హై!

 మేరీ జుబాన్‌ సే పర్వర్‌దిగార్‌ బోల్తా హై!!’’

(మనస్సాక్షిగా, విశ్వాసంతో చెపుతున్నా

నాచేత ప్రతీ మాటా ఆ దేవుడే పలికిస్తాడు!!)

ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఎలా ఏటికి ఎదురీదాలో కవి చెపుతున్నాడీ షేర్‌లో:

‘‘తూఫానోం సే ఆంఖ్‌ మిలావో, సైలాబోం పర్‌ వార్‌ కరో

మల్లాహోం కా చక్కర్‌ ఛోడో, తైర్‌ కే దరియా పార్‌ కరో’’

(తూఫాన్లను నేరుగా ఢీకొట్టు, ఉప్పెనలపై విరుచుకుపడు

నావికులపై ఆశలొద్దు, నదిని ఈది ఆవలి ఒడ్డుకి చేరు)

మత కలహాల కేసుల్లో విచారణ ఎలా హాస్యాస్పదంగా సాగుతుందో వ్యంగ్యంగా చెపుతాడు. 

‘‘అబ్‌ కహాఁ ఢూండ్నే జావోగే హమారే కాతిల్‌?

ఆప్‌ తో కత్ల్‌ కా ఇల్జామ్‌ హమీ పర్‌ రఖ్‌ దో!’’

(మా హంతకుల కోసం ఎక్కడెక్కడని వెతుకుతారు?

ఆ హత్యా ఆరోపణ కూడా మామీదే తోసేయండి!’’)

రాహత్‌ షాయిరీకి ఎల్లలు లేవు. భావ ప్రకటనకు విధి, నిషేధాలు లేవు. తన జీవితకాలంలో లెక్కలేనన్ని దేశాల్లో పర్యటించి కవిత చెప్పినా భరతమాత బిడ్డగా ఈ దేశంతో ఆయనకు ఉద్వేగపూరిత అనుబంధం ఉంది. తాను అచ్చమైన భారతీయుడినని చెప్పుకుంటాడు. 


‘‘హమే పహ్‌చాన్‌తే హో? హమ్‌ కో హిందుస్థాన్‌ కహ్‌తే హైఁ

మగర్‌ కుఛ్‌ లోగ్‌ జానే క్యోం హమే మెహ్‌మాన్‌ కహ్‌తే హైఁ’’

(నన్ను గుర్తు పట్టావా? నన్ను భారత్‌ అంటారు

కానీ, కొందరేమో అతిథి అని ఎందుకంటారో తెలీదు)

గత ఆరేళ్లుగా ప్రధాని మోదీ, సంఘ్‌ పరివార్‌పై రాహత్‌ లెక్కలేనన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. తరచుగా విదేశా లకు వెళ్ళే మోదీపై ఒక షేర్‌ ఇది.

‘‘ఐసీ సర్దీ హై కే సూరజ్‌ భీ దుహాయీ మాంగే

జో హో పర్‌దేశ్‌ మే వహ్‌ కిసే రజాయీ మాంగే’’

(చలికి సూర్యుడు కూడా గజగజ వణుకుతున్నాడు

విదేశంలో ఆయన ఎవర్ని అడుగుతారు దుప్పటి?)

మత కలహాలు, యుద్ధం వల్ల వినాశనాన్ని చెబుతాడు కవి ఇలా:

‘‘మై అప్నీ లాష్‌ లియే ఫిర్‌ రహా హూఁ కాంధే పర్‌

యహాఁ జమీన్‌ కీ కీమత్‌ బహుత్‌ జ్యాదా హై’’

(నేను నా శవాన్ని భుజాలకెత్తుకుని తిరుగుతున్నా

ఇక్కడ భూమి రేటు చాలాచాలా ఎక్కువ)

నెత్తుటి రాజకీయాలు, కోర్టులు, న్యాయం, ధర్మం అన్నింటినీ ఎలా ఏకపక్షంగా మార్చేశారో అంటూ ఆక్రోశిస్తున్నాడు షాయర్‌.

‘‘తుమ్హే సియాసత్‌ నే హక్‌ దియా హై

హరీ జమీనోంకో లాల్‌ కర్‌ దో

అప్పీల్‌ భీ తుమ్‌, దలీల్‌ భీ తుమ్‌

గవాహ్‌ భీ తుమ్‌, వకీల్‌ భీ తుమ్‌

జిసే భీ చాహో హరామ్‌ కహ్‌ దో, 

జిసే భీ చాహో హలాల్‌ కర్‌ దో.’’

(నీకు రాజకీయం అధికారమిచ్చింది

పచ్చటి పుడమిని ఎర్రగా మార్చేయ్‌!

అప్పీలూ నీదే, వాదనా నీదే

సాక్షీ నువ్వే, వకీలూ నువ్వే

ఏది అనుకుంటే దాన్ని చట్టవిరుద్థం చేయ్‌!

ఏది కోరుకుంటే దాన్ని చట్టబద్ధం చేయ్‌!!)

సంఘ్‌ పరివార్‌ శక్తులు విజృంభించడంతో ముస్లింల పరిస్థితి ఎలా మారిందో ఈ షేర్‌లో వర్ణిస్తాడు రాహత్‌. 

‘‘కోయీ క్యా సోచ్‌తా రహతా హై మేరే బారే మే?

ఏ ఖయాల్‌ ఆతే హీ హమ్‌సాయే సే డర్‌ లగ్‌తా హై

ఏక్‌ నయే ఖౌఫ్‌ కా జంగల్‌ హై మేరే చారోం తరఫ్‌

అబ్‌ ముఝే షేర్‌ నహీఁ, గాయ్‌ సే డర్‌ లగ్‌తా హై’’

(నా గురించి ఎవరైనా ఏమనుకుంటారో... ఏంటో...

ఈ ఆలోచనవస్తే పొరుగువాడిని చూసి భయమేస్తోంది

నా చుట్టుతా భయోత్పాతమైన కొత్త అడవి ఉంది...

నాకిప్పుడు పులి కాదు, గోవుని చూస్తే భయమేస్తోంది.)

ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ని ఇందోరీ ఎలా వెటకరిస్తు న్నారో చూడండి.

‘‘బాత్‌ మన్‌ కీ కహేఁ, యా వతన్‌ కీ కహేఁ

ఝూట్‌ బోలేతో ఆవాజ్‌ భారీ రఖేఁ’’

(మనసులోని మాట చెప్పినా, దేశం ముచ్చట చెప్పినా

అబద్ధం చెబితే బల్లగుద్ది మరీ గట్టిగా చెప్పాలి)

రాహత్‌ ఇందోరీకి దేశ, విదేశాలలో లెక్కలేనన్ని అవార్డు లొచ్చాయి. కానీ, కేంద్రం నుంచి విశిష్ట పురస్కారం ఏదీ రాలేదు. దీనిపై ఆయనకు ఏదైనా బాధ ఉందా? ఇలాంటి అనుమానాలను పటాపంచలుచేస్తూ ఒక షేర్‌ చెప్పారిలా: 


‘‘అప్నా మాలిక్‌, అప్నా ఖాలిక్‌ అఫ్జల్‌ హై!

ఆతీ జాతీ సర్కారోం సే క్యా లేనా?’’

(నా దైవం, సృష్టికర్త అంతా అల్లాయే

వచ్చే పోయే సర్కార్ల నుంచి నేనేం తీసుకుంటా?)

తన మరణానంతరం ఈ ప్రపంచం తనను ఎలా గుర్తుం చుకోవాలో ఈ 70ఏళ్ల షాయర్‌ ఇలా చెప్పుకున్నాడు. 

‘‘మై జబ్‌ మర్‌ జావూఁ తో 

      మేరీ అలగ్‌ పహెచాన్‌ లిఖ్‌ దేనా

లహాసే మేరీ పేషానీ పే హిందుస్థాన్‌ లిఖ్‌ దేనా’’

(నేను పోయాక నాకో ప్రత్యేక గుర్తింపునివ్వండి

నెత్తుటితో నా నుదుటన భారత్‌ అని లిఖించండి)

మెహక్‌ హైదరాబాదీ

70361 75175


Updated Date - 2020-04-13T06:07:42+05:30 IST