రహదారి కోసం ఆందోళన

ABN , First Publish Date - 2022-08-08T06:15:50+05:30 IST

తమ ప్రాంతానికి పక్కా తారురోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీకి చెందిన గిరిజనులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక ఆదివారం ఆందోళన చేపట్టారు.

రహదారి కోసం ఆందోళన
భారీ వర్షంలో ర్యాలీ చేపడుతున్న గిరిజనులు

- కుంతుర్ల నుంచి బట్రోతుపుట్టు వరకు నిరసన ర్యాలీ 

- గిరిజనులకు విపక్షాల మద్దతు


పాడేరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): తమ ప్రాంతానికి పక్కా తారురోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీకి చెందిన గిరిజనులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక ఆదివారం ఆందోళన చేపట్టారు. పాడేరు మండలం బట్రోతుపుట్టు గ్రామం నుంచి పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ కేంద్రం వరకు ఆరు కిలోమీటర్లు రోడ్డు బాగాలేకపోవడంతో రెండు మండలాలకు చెందిన సుమారుగా 20 గ్రామాలకు చెందిన గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిస్తే ఆ మార్గంలోని గెడ్డలు పొంగడం, వంతెనలు లేకపోవడంతో గిరిజనులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమస్యపై అనేక మార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంత గిరిజనులు ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ ఆదివారం కుంతుర్ల గ్రామం నుంచి బట్రోతుపుట్టు వరకు ఆరు కిలోమీటర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే మార్గమధ్యంలోని ఓ గెడ్డలో వారంతా దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలకులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులు స్వచ్ఛందంగా చేపట్టిన ఈ ఆందోళనలో టీడీపీ నేత, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ నేతలు బాకూరు వెంకటరమణరాజు, పాండురంగస్వామి, టి.త్రినాథ్‌, కె.రాజారావు, బీజేపీ నేతలు కురసా ఉమామహేశ్వరరావు, కూడా రాధాకృష్ణ, ఎస్‌.వేమనబాబు,  సీపీఐ నేత కూడా రాధాకృష్ణ, కుంతుర్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు అప్పారావు, స్థానికులు రామచంద్రుడు, మణికుమారి, అనిల్‌, సూరిబాబు, మూర్తి, వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T06:15:50+05:30 IST