రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకా

ABN , First Publish Date - 2021-05-05T04:32:24+05:30 IST

కరోనా టీకా వేయించుకునే వారు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది

రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకా
కొవిన్‌ యాప్‌ బ్రౌజర్‌

-స్పాట్‌ నమోదుకు మంగళం

- రెండో డోసు వ్యాక్సినేషన్‌కు సైతం వర్తింపు

- జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల ఏర్పాటు 

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 4: కరోనా టీకా వేయించుకునే వారు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను తీసుకు వచ్చింది. స్పాట్‌ రిజిస్ట్రేషన్లకు స్వస్తి పలికి ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న రోజు వ్యాక్సిన్‌ కొరత ఏర్పడితే మరుసటి రోజు వచ్చి తీసుకోవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 34,027 మందికి టీకా వేశారు. సెకండ్‌ వేవ్‌ కరోనా వేగంగా వ్యాప్తి చెందు తుండడంతో కరోనా టీకాకు డిమాండ్‌ పెరిగింది. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి పాజిటీవ్‌ వచ్చినా ప్రాణాలతో బయట పడుతుండడంతో టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో జిల్లాలో వ్యాక్సి నే షన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రజల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం వ్యాక్సిన్‌ సెంటర్లలోనే స్పాట్‌ రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టింది. టీకా కోసం ఆసుపత్రికి వచ్చిన వారి ఆధార్‌ లింక్‌తో పేరును నమోదు చేసి వ్యాక్సిన్‌ చేసేవారు. ఇలా రోజుకు పరిమితం లేకుండా టీకా వేశారు. ఇన్ని రోజుల పాటు జరి గి న ఈ ప్రక్రియకు బ్రేక్‌ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి వారికే  ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

జిల్లా వ్యాప్తంగా..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ వేసేం దుకు అధికారులు 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆసి ఫాబాద్‌, పట్టణాలతో పాటు మండలాల్లోన్ని పీహెచ్‌సీలలో ఈ కరోనా వ్యాక్సిన్‌ టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రతి రోజు వంద స్లాట్‌ బుక్కింగ్‌లను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 2.300 టీకాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి డోసు టీకా వేసు కుని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం ఒక రోజు ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. నాలుగు వారాలు గడిచిన తరువాత ఒక రోజు ముందుగా ఎప్పుడైనా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. అయితే వీరికి వ్యాక్సినేషన్‌ అదే రోజు మాత్రం అవకాశం ఇవ్వరు. 

జిల్లాలో 2.5 లక్షల మంది..

జిల్లాలో 45 సంవత్సరాలు నిండిన వారు 2.5 లక్షలు ఉన్నట్లు అం చనా. ఇందులో ఇప్పటి వరకు మొదటి, రెండో డోసులు 34,027 మందికి టీకా వేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకా వేస్తామని కేం ద్ర ప్రభుత్వం ప్రకటించినా వ్యాక్సిన్ల కొరత కారణంగా వేయలేక పోయా రు. ు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారు స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని టీకా కోసం ఎదురు చూస్తున్నారు. 

కొవిన్‌, ఆరోగ్య సేతులలో స్లాట్‌ బుకింగ్‌..

కొవిడ్‌ టీకా వేసుకోవాలంటే 45 ఏళ్లుపై బడిన వారు ఇక నుంచి కొవిన్‌ పోర్టల్‌ లేదా, స్మార్ట్‌ ఫోన్‌ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుని అందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకునే క్రమంలో జిల్లా ఏ సెంటర్‌లో టీకా వేసుకునే విషయం క్లుప్తంగా వివరించాలి. ఒక సెల్‌ఫోన్‌ నంబర్‌తో అయిదుగురు వ్యక్తులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. 

మారుమూల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు..

స్లాట్‌ బుకింగ్‌తో మారుమూల గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఇది వరకు ఆయా పీహెచ్‌సీలకు వెళ్లి నేరుగా ఆధార్‌కార్డు నంబరు చెప్పడం ద్వారా నమోదు చేసుకుని టీకా వేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం స్పాట్‌ రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసి స్లాట్‌ బుకింగ్‌ ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మారుమూల మం డలాలైన బెజ్జూరు, తిర్యాణి, లింగాపూర్‌, సిర్పూర్‌(యూ), కెరమెరి తదితర మండలాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం సక్రమంగా ఉండదు. దీంతో ఆయా మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే టీకా..

- కుంరం బాలు, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో ఇక నుంచి కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్‌లో ముం దస్తు స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే టీకా వేస్తాం. స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం నిలిపి వేసింది. జిల్లాలో 23 కేంద్రా లను ఏర్పాటు చేశాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2021-05-05T04:32:24+05:30 IST