లోక్‌సభలో రఘురామ వర్సెస్ మిథున్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-06T19:21:38+05:30 IST

లోక్‌సభలో రఘురామ వర్సెస్ మిథున్‌రెడ్డి మధ్య పెద్ద వారే జరిగింది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాటల యుద్ధం చేశారు.

లోక్‌సభలో రఘురామ వర్సెస్ మిథున్‌రెడ్డి

న్యూఢిల్లీ : లోక్‌సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్య పెద్ద వారే జరిగింది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాటల యుద్ధం చేశారు. జీరో అవర్‌లో రైతుల మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పించడాన్ని రఘురామ తప్పు పట్టారు. రఘురామ వ్యాఖ్యలను లోక్‌సభా పక్ష నేత మిధున్ రెడ్డి ఖండించారు. గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమని రఘురామ పేర్కొన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ క్షీణించాయన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారన్నారు. రఘురామ ప్రసంగాన్ని  వైసీపి ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఎంపీ మిధున్ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే.. తన పైన రెండు సీబీఐ కేసులే ఉన్నాయని... సీఎం జగన్‌ పైన వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఎంపీ రఘురామ కౌంటర్ ఇచ్చారు.



Updated Date - 2021-12-06T19:21:38+05:30 IST