వాలంటీర్ వ్యవస్థపై ఎంపీ రఘురామ తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-08-08T20:41:30+05:30 IST

ప్రభుత్వంపై, వాలంటీర్ వ్యవస్థపై మరోసారి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు

వాలంటీర్ వ్యవస్థపై ఎంపీ రఘురామ తీవ్ర వ్యాఖ్యలు

ఢిల్లీ: ప్రభుత్వంపై, వాలంటీర్ వ్యవస్థపై మరోసారి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని మన పార్టీ నాయకులే సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారు. నిజంగానే వాలంటీర్లే అంతా బాగా పని చేస్తే కోవిడ్ కేసులు ఎందుకు పెరిగాయి. వాలంటీర్ వ్యవస్థలో వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాల్సి ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు లేవా?, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా ఫ్రాంక్లిన్‌ ఎందుకు కితాబు ఇచ్చారో అర్థం కావట్లేదన్నారు. మనకు కితాబులు కాదు.. గ్రౌండ్‌ రియాల్టీ కావాలి. ఫ్రాంక్లిన్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండానే మెచ్చుకున్నారు. ఓ వైపు కోవిడ్‌తో మనుషులు చచ్చిపోతుంటే.. ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. కితాబు ఇస్తే.. దాన్ని ప్రచురించడం అంత అవసరమా?, శ్మశానాల్లో కూడా రోగులకు టెస్టులు చేశారు. ఏపీలో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఒకసారి ఆలోచించాలి. కరోనా విషయంలో చాలా అలసత్వం వహించారు. విశాఖ ఎప్పుడు వెళ్లిపోదామన్న ఆలోచనతోనే ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనాను బాగానే కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఏపీలోనే పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 


చెక్కుల పేరుతో ఫొటో ఫోజులు

‘సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ఏవో చెక్కులు ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రితో ఫొటోలకు ఫోజులిచ్చిన విషయం తెలియదా? ఏ ఎమ్మెల్యే కూడా సొంతంగా ఒక్క పైసా ఇవ్వలేదు. అదంతా ప్రజల సొమ్మే. ఈ మాట నచ్చక వైసీపీ ఎమ్మెల్యేలు తిరగబడినా ఫర్వాలేదు. నిజమేంటో ప్రజలకు బాగా తెలుసు. ఆ నిజమేంటో మీ(ముఖ్యమంత్రి) మససుకు తెలియాలి. ఎమ్మెల్యేలంతా డబ్బు ఎలా సేకరించారో అందరికీ తెలుసు. నిజంగా ఎమ్మెల్యేలు డబ్బు ఇవ్వాలనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు కదా? ఈ విషయంలో ఏం జరిగిందో ముఖ్యమంత్రే తెలుసుకోవాలి’ అని చెప్పారు.


బ్రాండు పేరుతో ప్రాణాలు తీస్తున్నారు.

‘ఊరు, పేరు లేని బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మద్యం కొనలేక శానిటైజర్లు తాగి చచ్చిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలు పెట్టడం సరికాదు. మద్యానికి పాత రేట్లే మళ్లీ పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. 


ఎదురుదెబ్బ తప్పదు

‘అమరావతి విషయంలో ప్రభుత్వం సాధించేది ఏమి ఉండదు. అనవసరంగా ప్రజాధనం వృధా చేయొద్దు. సలహాదారులే పాడుచేస్తున్నారు. కచ్చితంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదు. పక్క రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా.. మీకు(సీఎం జగన్‌) మూడో ర్యాంకు రావడానికి సంకేమ పథకాలే కావొచ్చు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. డబ్బు లేకుండా విశాఖ, కర్నూలు రాజధానులు చేయడం ఎందుకు?, ఇలాంటి సమయంలో డబ్బు వృధా చేయొద్దు. ప్రజా ఆమోదం లేని నిర్ణయాలు తీసుకోవద్దు. అమరావతిలో ప్రస్తుతం మీకు మేలే జరుగుతోంది. అమరావతికి.. జిల్లాల విభజనకు ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచమంతా ఒక దారి వెళ్తుంటే.. ప్రభుత్వం మాత్రం మరొక దారిలో వెళ్లకూడదు.’ అని సూచించారు.

Updated Date - 2020-08-08T20:41:30+05:30 IST